కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో మంగళవారం కుమ్రం భీం 85వ వర్ధంతిని ఘనంగా నిర్వహించగా, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎస్పీ కాంతిలాల్ సుభాష్‌పాటిల్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్, అదనపు ఎస్పీ చిత్త నిరంజన్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, భీం మనుమడు సొనేరావు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం నివాళులర్పించారు.
యోధుడి విగ్రహం, సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడిన భీం త్యాగాలను స్మరించుకొని, వీరుడా వందనమంటూ నినాదాలు చేశా రు. ఆయన సేవలను కొనియాడారు. కుమ్రం భీం పోరాట స్ఫూర్తితోనే తె లంగాణ రాష్ట్రం సాధ్యమైందని చె ప్పుకొచ్చారు. కలెక్టర్ వెంకటేశ్ ధో త్రే మాట్లాడుతూ భీం ఆదివాసీల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేశారన్నారు. వర్ధంతి సభ విజయవంతమయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు హట్టి నుంచి జోడేఘాట్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. భీం పోరాటం ఫలితంగానే ఆదివాసుల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జోడేఘాట్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, జోడేఘాట్ వరకు రెండు వరుసల రహదారి, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశారని కొనియాడారు. తరతరాలుగా పోరాడుతున్న గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోడు పట్టాలు అందించిందని గుర్తు చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ఎనలేని కృషి చేశారన్నారు. ఆదివాసీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.