మంచిర్యాల (ఏసీసీ), నవంబర్ 18: గ్రామీణ స్థాయిలోని సహకార సంఘాల సభ్యులకు నాణ్యమైన సేవలందించినప్పుడే వికసిత భారత్కు పునాది ఏర్పడుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక యూనివర్సల్ అర్బన్ బ్యాంక్ లో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడు తూ కేంద్రం.. నూతనంగా సహకార మంత్రి త్వ శాఖ ఏర్పాటు చేసి, అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించిందని పేర్కొన్నారు. పరస్పర సహకారంతో సంఘాలు ప్రగతి పథంలో పయనించాలని ఆకాంక్షించారు.
అనంతరం ప్రగతి కనబర్చిన సంఘాలకు జ్ఞాపికలు అందజేశారు. మరో అతిథి సంజీవ రెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల సేవలను అందించేందుకు సహకార శాఖ సిద్ధంగా ఉందన్నారు. గోదాం, భూములు, పెట్రోల్ బంక్ వంటివి అందించేందుకు అనుకూలంగా ఉన్నామని, ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు సోలార్ పరిశ్రమలు, క్యాంటీన్స్ తదితర వాటిని ఏర్పాటు చేయుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విశిష్ట కాకతీయ సహకార శిక్షణ కేంద్రం వరంగల్ ప్రిన్సిపల్ లూనవత్ యాకుబ్ నాయక్ సహకార వారోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం బాగా పనిచేసిన సంఘాలకు తెలంగాణ సహకార యూనియన్ హైదరాబాద్ తరపున బహుమతులు అందించారు. బ్యాంక్ చైర్మన్ వినయ్ కుమార్ అధ్యక్షత వహించిన బ్యాంక్ సీఈవో మూర్తి, సహకార శాఖ అధికారులు కే.రవీందర్ రావు, మల్లారెడ్డి, హన్మంత్ రెడ్డి, రవికిశోర్, సందీప్ కుమార్, పీఏసీఎస్ చైర్మ న్లు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు.