ఉట్నూర్, మే27 : ప్రభుత్వ దవాఖానల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) కేంద్రం బృందం సభ్యుడు బాల సుబ్రహ్మణ్యం అన్నారు. ఉట్నూర్ దవాఖానను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానలు పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసినవని తెలిపారు. వైద్యులు సకాలంలో స్పందించి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జిల్లాలోని వైద్యశాలలను సందర్శిస్తున్నామని తెలిపారు. దవాఖాన నిర్వహణ, ఖర్చులు, రికార్డు, నూతన నిర్మాణాలు తదితర అంశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అనంతరం మందులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం సభ్యు లు సంజీవ్ కుమార్ గుప్తా, హరికృష్ణ, అనంత పద్మనాభం, శ్రీనివాస్, శ్రీకాంత్, డిప్యూటీ డైరెక్టర్ విజయ్, దవాఖాన సూపరింటెండెంట్ ఉపేందర్, రవి, మహేందర్,సిబ్బంది ఉన్నారు.
ముస్కాన్ ర్యాంక్‌పై సంబరాలు
ఉట్నూర్ దవాఖానకు రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ రావడంతో సూపరింటెండెంట్ ఉపేందర్ ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. దవాఖానలో సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది సమష్టి కృషిని కొనియాడారు. ఇలాగే పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
బేలలో కేంద్ర అధికారుల బృందం పర్యటన
బేల,మే27: బేల మండల కేంద్రానికి మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణ పనులను కేంద్ర అధికారుల బృందం శనివారం పరిశీలించింది. ఈ భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా కేంద్ర అధికారుల బృందం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. వారి వెంట మండలంలోని ప్రజాప్రతినిధులు ,అధికారులు పాల్గొన్నారు.
లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పూజలు
జైనథ్,మే27: మండల కేంద్రంలోని అతిపురాతన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ పరిపాలనా అధికారి డాక్టర్ ఎంఏ. బాలసుబ్రహ్మణ్యం శనివారం దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సిబ్బంది సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఆంతకుముందు ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, జిల్లా క్షయ నివారణ అధికారి ఎం శ్రీకాంత్, డీఎంవో మెట్పెల్లివార్ శ్రీధర్, పీ వెంకట్ రెడ్డి, టూరిజం గైడ్ లింగన్న, బాల్‌రాజ్‌గౌడ్ ఉన్నారు.