ఆదిలాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ఆదిలోనే హంసపాదుగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించినా ప్రహసనంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీలో సమస్యలు పరిష్కరించాలని స్వయంగా డీలర్లు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దీంతో పంపిణీ పథకం లోప భూయిష్టంగా ఉందనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 1,91,676 మంది లబ్ధిదారులకు 356 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెల 4062.83 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. మార్చి నెల వరకు ఫ్లోరిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది.
దర్శనమిస్తున్న బియ్యం లేవనే బోర్డులు
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కాగా మొదటి నుంచి సమస్యలు వెంటాడుతున్నాయి. పలు మండలాల్లో గ్రామాలకు బియ్యం పంపిణీలో జాప్యం జరిగింది. దీంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదిలాబాద్ పట్టణంలోను పలు దుకాణాల్లో ఐదు రోజులుగా పంపిణీ నిలిచింది. పట్టణ పరిధిలో 42 దుకాణాలు ఉండగా చాలా దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశామని, స్టాక్ అయిపోవడంతో బోర్డులు పెట్టాల్సి వచ్చిందని రేషన్ డీలర్లు అంటున్నారు. సన్నబియ్యం తీసుకుందామని దుకాణాలకు పోయిన లబ్ధిదారులు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
కలెక్టర్కు వినతిపత్రం
సన్నబియ్యం పంపిణీలో సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్లు గురువారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఎంఎల్ పాయింట్ల నుంచి సన్నబియ్యంకు బదులు దొడ్డుబియ్యం సరఫరా అవుతున్నాయని, ఈ బియ్యం పంపిణీ చేస్తే లబ్ధిదారులు తమతో గొడవకు దిగుతున్నారని తెలిపారు. బియ్యం సరఫరా కాకపోవడంతో దుకాణాలను మూసివేసి నో స్టాక్ బోర్డులు పెట్టామని, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద బియ్యం నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పోర్టబిలిటీ వచ్చిన వెంటనే అలాట్మెంట్కు సరిపడా బియ్యం రేషన్ దుకాణాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని, నిల్వలు లేని కారణంగా పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుందని, లబ్ధిదారులకు బియ్యం అందేలా పంపిణీ తేదీని పొడిగించాలని వినతిపత్రంలో కోరారు.
దొడ్డు బియ్యం ఇస్తున్నారు..
ఆదిలాబాద్ పట్టణ పరిధిలోని పలు దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సన్నబియ్యం రావడం లేదు. దొడ్డు బియ్యం ఎందుకు వస్తున్నాయని సివిల్ సప్లయ్ అధికారులను అడిగితే గంగా, గోదావరి రకం సన్నబియ్యం దొడ్డుగానే ఉంటాయని సమాధానం ఇస్తున్నారని రేషన్ డీలర్లు అంటున్నారు. ఈ బియ్యం తీసుకున్న లబ్ధిదారులు తమతో గొడవ పడుతున్నారు. దుకాణాల్లో బియ్యం అయిపోగా సరఫరా చేయాలని అధికారులను అడిగితే నిల్వలు లేవని అంటున్నారు. దీంతో నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి.
– వేణుగోపాల్, అధ్యక్షుడు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం, ఆదిలాబాద్