నిర్మల్ అర్బన్, మే 16 : నిర్మల్ జిల్లాలో బెల్ట్ దుకాణాలు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సామాన్యులు, లేబర్లను మచ్చిక చేసుకొని వైన్స్‌లు ఓపెన్ కాకముందే బెల్ట్ దుకాణాలు తెరుస్తున్నారు. వైన్స్‌లో లైట్ బీరు రూ.180 ఉండగా.. బెల్ట్ దుకాణాల్లో రూ.200లకు విక్రయిస్తున్నారు. రాత్రి 12 గంటలు అయితే రూ.180 ఉన్న బీరు దాదాపు రూ.300లకు విక్రయిస్తున్నారు. ఇది కేవలం బీర్లకు మాత్రమే కాకుండా.. మిగతా మద్యం ధరలకు వర్తిస్తుంది. అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన మందుబాబులు చేసేదేమి లేక మద్యం కొనుగోలు చేసి వెనుదిరుగుతున్నారు.
నిర్మల్ జిల్లా ఎక్సైజ్ పరిధిలో 47 వైన్సులు, ఎనిమిది బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇందులో నిర్మల్ ఎక్సైజ్ పరిధిలో 29 వైన్స్‌లు ఉండగా, ఐదు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. భైంసా ఎక్సైజ్ పరిధిలో 18 వైన్స్‌లు, మూడు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు రోజు రూ.1.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇవే కాకుండా గ్రామాల్లో మినీ వైన్స్లుగా చెప్పుకొనే బెల్ట్ షాపులు చాలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు ఉన్నాయి. 24 గంటలపాటు అందుబాటులో ఉండే ఈ బెల్ట్షాఫుల్లో దాదాపు 30 శాతం విక్రయాలు జరుగుతున్నాయి. కాగా.. అక్రమంగా నడుస్తున్న బెల్ట్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల ఎంసీపీ ఐయూ ఆధ్వర్యంలో కలెక్టర్ భవేశ్ మిశ్రాకు వినతి పత్రం అందించారు. కానీ.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. బెల్ట్ షాపులను అడ్డుకట్ట వేయాల్సిన అబ్కారీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అధిక ధరలకు మద్యం విక్రయించడంతో సామాన్యులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.50 నుంచి రూ.100 వరకు విక్రయిస్తుండడంతో కూలీ డబ్బులు మద్యానికే వెచ్చిస్తున్నారు. గ్రామాల్లో గొడవలు, అల్లర్ల సంఖ్య పెరిగిపోతున్నది.
నిర్మల్ జిల్లాలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఏడు బెల్ట్ దుకాణాలపై అబ్కారీ అధికారులు కేసులు నమోదు చేశారు. 2023 సంవత్సరంలో 108 కేసులు నమోదు కాగా.. 2024లో 98, 2025లో 70, 2026 మే వరకు ఏడు కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ విషయమై నిర్మల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏం.ఏ రజాక్‌ను అడుగగా.. బెల్ట్ షాపులపై ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.