భైంసా/ మామడ, ఏప్రిల్ 1: చెట్లన్నీ చిగురించే వేళ.. పూల పరిమళాలు వెదజల్లే వేళ.. లేలేత చివుళ్లు మేసి, కోయిలమ్మలు కుహు కుహూ రాగాలు తీస్తున్న వేళ.. వచ్చేది వసంతం! ఆరు రుతువుల్లో ఇది ప్రత్యేకం! ఈ రుతువు ఆగమనంతో తెలుగు కొత్త సంవత్సరం ఉగాది ఆరంభమవుతుంది. ప్లవ నామ సంవత్సరం ముగిసి.. నేటి నుంచి సకల శుభాలు కలిగించే శ్రీ శుభకృత్ సంవత్సరం మొదలవుతుంది.
ప్రకృతిలో మార్పు కారణంగా వచ్చే తొలి పండుగ ఉగాది. ఉగాది అంటే యుగాలకు ఆదిగా చెబుతుంటారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది జరుపుకుంటాం. తెలుగువారంతా గొప్పగా చేసుకునే ఉత్సవం. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు దానికి అధిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇది వసంత రుతువుతో ప్రారంభమవుతుంది. చెట్లన్నీ కొత్త పూలు, చిగుళ్లు, కాయలతో శోభిస్తుంటాయి. కనులకు విందును కలుగజేస్తాయి.
తెలుగు సంవత్సరాదిగా ఉగాదిని వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడిని దేవునికి నివేదించి ఇంటిల్లిపాదీ సేవిస్తారు. సాయంత్రం పలు చోట్ల, ముఖ్యంగా దేవాలయాల్లో పంచాంగ శ్రవణం చదవడం ఆనవాయితీగా వస్తున్నది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలను కలిగి ఉండడంతో ‘పంచాంగం’ అని పిలుస్తుంటారు. ఆయా రాశుల్లో పుట్టిన వారి అశుభశుభ ఫలితాలు, యోగక్షేమాల గురించి పూజారులు వివరిస్తుంటారు. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి విషయాలను సమగ్రంగా, మాసాల వారీగా చెబుతుంటారు.
ముందుగా వచ్చే ఖగోళ శాస్త్ర మార్పులను గ్రహించి జీవన మార్గాన్ని సులభతరం, సుఖతరం చేసుకునేందుకు పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ఆ సంవత్సరంలోని మంచీ చెడులు, కందాయ ఫలాలు, ఆదాయ ఫలాయాలు, స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతారు. రైతులతో పాటు తెలుగు వారు ప్రతి ఒక్కరూ తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాదిని ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ప్లవ నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శుభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకను నిర్వహించేందుకు ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారు. శుభకృత్ సంవత్సరంలో అందరికీ శుభాలు కలుగాలని కోరుకుంటారు.
షడ్రుచుల సమ్మేళనం..
ఉగాది రోజున బ్రాహ్మీ ముహూర్తాన మేల్కొని, అభ్యంగన స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని, దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటుంటారు. ఉగాది గొప్పతనం అంతా ఉగాది పచ్చడిలోనే ఉంటుంది. షడ్రుచుల సమ్మేళనంతో తయారుచేసే శ్రేష్టమైన పదార్థమే ఉగాది పచ్చడి. తీపి, చేదు, పులుపు, ఉప్పు, ఘాటు, వగరు వంటి రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆరోగ్యం పరంగానూ అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. జీవితంలోని కష్ట సుఖాలు, బాధ, సంతోషాలు, ఒడిదుడుకులను సమానంగా భావించి జీవితాన్ని సాగించాలని ఇది ఉద్బోధిస్తుంది. వేప, బెల్లం, చింతపండు మిశ్రమం ఆరోగ్యదాయకం.
వ్యాధి కారక క్రిములు, జ్వరం, ఉదర రోగాలు, కడుపులోని మంట, ఉష్ణాన్ని, అజీర్తిని నశింపజేస్తుంది. వేప పువ్వు పచ్చడి తినడం ఈ పండుగ విశిష్టత. రుతు సంబంధ పండుగ కావడంతో తప్పనిసరిగా వేపపువ్వు పచ్చడి తినాలని పెద్దలు చెబుతుంటారు. కొత్త సహస్రాబ్ధికి ప్రారంభసూచకంగా భావించే ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచీ చెడులు, కష్టసుఖాలు, ఆనంద విషాదాలను సంయమనంతో, సానుకూలంగా స్వీకరించాలన్న సందేశమే ఉగాది పచ్చడిలోని ఆంతర్యం. తీపి సుఖ సంతోషాలను, చేదు బాధలను, వగరు బంధాలను ఇలా ప్రతి ఒక్క పదార్థం శరీరానికి, ప్రకృతికి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం వల్ల ఏడాదంతా శుభాలు కలుగుతాయని నమ్మకం. ఫ్లవ నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శుభకృత్కు స్వాగతం పలికేందుకు, ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు పండుగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
అన్నీ శుభాలే కలగాలి
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 1 : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ( శ్రీ శుభకృత్ నామ సంవత్సరం) సందర్భంగా శుబాకాంక్షలు. శుభకృత్ అంటే శుభాలను కలిగించేది. పేరుకు తగ్గట్టుగానే కొత్త ఏడాదిలో అందరికీ శుభమే జరుగాలని కోరుకుంటున్నా. ఈ పండుగను ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోవాలి. ప్రజలంతా ఆయురారోగ్యాలు, ఐష్టెశ్వర్యాలతో తులతూగాలి. ముఖ్యంగా కరోనా మహమ్మారి శుభకృత్లో పూర్తిగా తొలగిపోవాలి. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలి.
– అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి