జన్నారం, జూన్ 3 : తాళ్లపేట రేంజ్ పరిధిలోని తపాలాపూర్ ప్రధాన రహదారిలోని చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న బీట్ ఆఫీసర్ సాయికుమార్, వాచర్ ఉత్కూర్ శ్రీనివాస్‌పై ఇద్దరు యువకులు తాగిన మైకంలో దాడి చేసినట్లు ఎస్ఐ రాజవర్ధన్ తెలిపారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి కారు నడుపుకుంటూ వచ్చి యాక్సిడెంట్ చేయగా, దండేపల్లి మండలం మేదరిపేట గ్రామానికి చెందిన ఆడే శ్రావణ్‌కుమార్, తీగల ఉదయ్‌తో పాటు మరికొందరు బైక్‌పై వెంబడించారు.
అటవీ సిబ్బంది కారును ఆపి చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా, శ్రావణ్‌కుమార్, తీగల ఉదయ్ అక్కడికి చేరుకున్నారు. కారు డ్రైవర్‌తో గొడవకు దిగారు. అంతలోనే బీట్ ఆఫీసర్ సాయికుమార్ కలగజేసుకొని ఇక్కడ గొడవచేయవద్దని యువకులకు చెబుతుండగా, మద్యం మత్తులో ఉన్న శ్రావణ్‌కుమార్, ఉదయ్.. బీట్ ఆఫీసర్ సాయికుమార్, వాచర్ శ్రీనివాస్‌పై దాడి చేశారు. సాయికుమార్ తలకు తీవ్రగాయమైంది. వెంటనే దవాఖానకు తరలించారు. సోమవారం బీట్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు యువకులపై కేసు నమోదు చేశారు.