ఇంద్రవెల్లి : వానాకాలంలో సీజనల్ వ్యాధులు ( Seasonal Diseases ) ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు ఆరోగ్యం పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్( DMO Rathod Narender ) అన్నారు. సోమవారం మండలంలోని పిట్టబోంగురం పీహెచ్సీలో నిర్వహించిన పీఎం జన్మన్ కార్యాక్రమంలో భాగంగా సంచార వైద్య వాహనం , ఐఈసీ వైద్య శిబిరాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిట్టబోంగురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డయేరియా నిర్మూలనకు45 రోజుల పాటు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు వచ్చే విరేచనాల నివారణకు వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ఇంటింటికీ ఓఆర్ఎస్ ద్రావణం అందించాలన్నారు.
వర్షకాలంలో పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.