కోటపల్లి, సెప్టెంబర్ 9 : సీజనల్ వ్యాధ్యులపై అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల ఇన్చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కోటపల్లి మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించారు. ఓపీ, మందుల స్టాక్ వివరాలను తెలుసుకున్నారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించి వివరాలు నమోదు చేయాలని, అవసరమున్న చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు ప్రతిరోజూ కొనసాగించాలని, విధులపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం ఆలుగామ గ్రామానికి వెళ్లి చెత్త పేరుకుపోయి ఉండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే చెత్తను తొలగించాలని ఆదేశించారు. జ్వర సర్వే గురించి ఆరా తీశారు. గ్రామంలో జ్వర సర్వే జరిగిందని పంచాయతీ కార్యదర్శి చెప్పగా, గ్రామస్తులు జరగలేదని చెప్పడంపై కలెక్టర్ మండిపడ్డారు. వర్షాలు కురుస్తున్నందున ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీపీవో వెంకటేశ్వర్రావు, ఇన్చార్జి ఎంపీడీవో ముల్కల్ల సత్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ మహేంద్రనాథ్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ ఉన్నారు.
రోగులకు మెరుగైన సేవలందించాలి
చెన్నూర్, సెప్టెంబర్ 9: ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇన్చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖాన పరిసరాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు. సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెన్నూర్‌లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. తహసీల్దార్, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.