సారంగాపూర్, జూలై 1 : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామ శివారులో శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బావ, బామ్మర్ది మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నా యి.. నిర్మల్‌కు చెందిన షేక్ అన్వర్ క్రేన్లను అమ్మకం, కొనుగోలు వ్యాపారం చేస్తుంటాడు. ఇందులో భాగంగానే షేక్ అన్వర్, తన బావ మరిది షేక్ అలీమొద్దీన్, అలీమొద్దీన్ బామ్మర్ది అబ్దుల్ సమీర్, రహీన్ కలిసి కారులో క్రేన్లను కొనుగోలు చేసేందుకు నిర్మల్ నుంచి శుక్రవారం రాత్రి 10 గంటలకు ఖమ్మం జిల్లాలోని మదిరా బయలుదేరారు. అయితే శనివారం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో మహ బూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామ శివారులో గేదెను తప్పించబోయే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో జామ్ గ్రామానికి చెందిన అబ్దుల్ సమీర్ (21), షేక్ అలీమొద్దీన్ (23) తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. నిర్మల్‌కు చెందిన షేక్ అన్వర్, రహీన్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం అక్కడే ఉన్న దవాఖానకు తరలిం చారు. కాగా కారు అద్దాలు తెరుచుకోక పోవడంతో స్థానికులు, పోలీసులు కారు పగులగొట్టి మృతదేహాలు, గాయపడిన ఇద్దరు వ్యక్తులను బయటికి తీశారు.
జామ్‌లో విషాదచాయలు..
జామ్ గ్రామానికి చెందిన షేక్ అలీమొ ద్దీన్, అబ్దుల్ సమీర్ ఇద్దరు బావబామ్మర్ది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదచాయాలు అలుము కున్నాయి. కాగా షేక్ హిమామొద్దీన్-రుక్సానా బేగంలకు ఏడుగురు సంతానం. షేక్అలీమొద్దీన్ ఒక్కడే కుమారుడు కాగా ఆరు గురు కుమార్తులు ఉన్నారు. అయితే అలీమొద్దీన్ చిన్నతనంలోనే తండ్రి హిమామోద్దీన్ ఆనారోగ్యం తో మృతి చెందాడు. తల్లి ఒక్కగానొక్క కుమారు డు అలీమొద్దీన్‌ను అల్లారు ముద్దుగా పెంచింది. బీడీలు చుడుతూ ఏడుగురు పిల్లలను తల్లి పెంచిపోషించింది. అలీమొద్దీన్ పెద్ద కావడంతో తన బావ నిర్మల్‌కు చెందిన షేక్ అన్వర్ వద్ద క్రేన్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కష్టపడుతూ రియాన, నజ్జు, రుదన, రేష్మా నలుగురు అక్కల పెళ్లిళ్లు కూడా చేశాడు. మరో అక్క నుస్రత్, చెల్లి సమ్రిన్ల పెళ్లి చేయాల్సి ఉండే. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అలాగే మరో విషాద కుటుంబం లో షేక్వహీద్-సబ్బుల సంతానానికి ఒక్కడే కూమారుడు సమీర్. సమీర్ ఒక్కడే కొడుకు కావడంతో తల్లింద్రులు కూలీ, నాలీ చేసి కొడుకును అల్లారుముద్దుగా పెంచుకున్నారు. సమీర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా అండగా ఉండేవాడు. కుటుం బానికి అండగా ఉంటాడనుకున్నా చేతికొచ్చిన కొడుకు ఇక లేడని తెలియడంతో ఆ తల్లిదండ్రులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. సమీర్ చిన్నా పెద్ద అనే తేడాలేకుండా స్నేహితులతో కలిసిమెలసి ఉండేవాడని, సమీర్ ఇకలేడని స్నేహితులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇద్దరు యువకులు ఒకేసారి మృత్యువాత పడడంతో గ్రామంలోని ప్రజల రోదనలు మిన్నంటాయి. ఈ రెండు కుటుంబాలు పేదలు కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.