ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, అక్టోబర్ 9 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక అయిన రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిందని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా శిశు, మహిళ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణుతో కలిసి హాజరై గౌరమ్మ, శారదాదేవి ప్రతిమలకు పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలు చాటే పండుగల విశిష్టతను భావితరాలకు చాటాలని, వేడుకలను ప్రజలంతా సంతోషంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళలతో కలిసి సరదాగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాసర్, డీఆర్డీవో దత్తారాం, జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.