బాసర, అక్టోబర్ 12 : దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఉత్సవాలు అక్టోబరు 15వ తేదీ ఆదివారం నుంచి 23వ తేదీ సోమవారం వరకు జరుగనున్నాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సరస్వతీ దేవికి పూజారులు విశేష పూజలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. యేటా నిర్వహించే ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ సౌకర్యాలు కల్పించనున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వైద్య, పోలీసు, ఆలయ అధికారులు సేవలందిస్తారు. గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాకు చెందిన జగదీష్ మహారాజ్ ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చి భక్తులకు ఉచితంగా అన్నదానం చేయనున్నారు. ఆలయంలో భక్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు సేవలు అందించనున్నట్లు ఆలయ ఈవో విజయరామరావు సూచించారు.
సరస్వతీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను సరస్వతీ ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆలయ గోపురాలకు ప్రత్యేక పూలతో అలంకరించారు. రాత్రివేళలో ఆలయం విద్యుత్ కాంతుల నడుమ మెరిసి పోతోంది. ఆలయంతోపాటు వ్యాసమహర్షి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు.
ఉత్సవాలు ప్రారంభమయ్యే రోజు ఆదివారం వేకువ జామున సరస్వతీ అమ్మవారిని అభిషేకం చేసిన తరువాత మంత్రపుష్పాలతో పూజలకు శ్రీకారం చుడతారు. ఉదయం తొమ్మిది క్షేత్రపూజ, కళశ పూజ, విజ్ఞేశ్వర పూజ, సుహాసిని పూజ, శ్రీ సరస్వతీ సహస్రనామం, లలిత సహస్ర నామం, కుంకుమార్చన పూజలు చేయనున్నారు. సాయంత్రం 6.30 గంటల నుంచి దేవిచత్షష్టి పూజలను వేద పండితులు నిర్వహించనున్నారు. అమ్మవారికి అభిషేకం ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు మాత్రమే చేసి అనంతరం చివరి రోజైన మహార్నవమి రోజున మాత్రమే అమ్మవార్లకు అభిషేకం నిర్వహించనున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి, మూడో రోజు చంద్రాగంట, నాల్గో రోజు కుష్మాండ దేవి, ఐదో రోజు స్కందామాత, ఆరో రోజు కాత్యాయని, ఏడో రోజు కాలరాత్రి, ఎనిమిదో రోజు మహాగౌరి, తొమ్మిదో రోజు సిద్ధి దాత్రి రూపాల్లో దర్శనం ఇవ్వనున్నారు.
ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురవడంతో బాసర వద్ద గోదావరి నది నిండుకుండను తలపిస్తున్నది. బాసరకు వచ్చే భక్తులకు గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు నది ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా నది వద్ద గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశారు.
ఉత్సవాల్లో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ముథోల్ సీఐ వినోద్‌రెడ్డి, బాసర ఎస్ఐ గణేశ్, వంద మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.