తాండూర్, మార్చి 6 : జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా పాలన సహాయ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన సహాయ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాల్లో తప్పులుంటే సరిదిద్దడానికి ఇవి ఉపయోగపడుతాయని తెలిపారు. కొత్తగా ప్రజాపాలన దరఖాస్తులు సైతం స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడి వారి దరఖాస్తు వివరాలను ఆయనే స్వయంగా కంప్యూటర్లో పొందుపర్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.
అక్కడి నుంచి మాదారంలోని రేషన్ దుకాణానికి వెళ్లి రికార్డులు పరిశీలించడంతో పాటు బియ్యం నిల్వల వివరాలను సరిచూశారు. కలెక్టర్‌కు స్థానిక ప్రజలు, నాయకులు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి సింగరేణి క్వార్టర్లలో నివసిస్తున్న ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని, ఓపెన్ కాస్ట్లో వెలికి తీసే మట్టిని ఊరిలో పోయకుండా చూడాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తానన్నారు. తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో, తహసీల్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.