చలి గజగజ వణికిస్తున్నా.. చన్నీటి స్నానమే, శరణుఘోషే, కఠిక నేలపైనే నిద్రే. చెడును, వ్యసనాలను దూరం చేస్తూ 41 రోజులపాటు అకుంఠిత దీక్షతో వేసుకునే మాలే అయ్యప్ప మాలధారణ. అయ్యప్ప మాలధారణకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందలాది ఆలయాలు ఉన్నాయి. ఇందులో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గుట్టలోని అయ్యప్ప ఆలయం శ్రీ అభినవ శబరిమలైగా పిలవబడుతోంది. ఈ ఆలయం నిత్యం స్వాముల శరణుఘోషతో మార్మోగుతోంది.
కార్తీక మాసంలో ప్రారంభమైన దీక్షలు 41 రోజులపాటు నియమనిష్ఠలతో కొనసాగుతాయి. కార్తీక మాసం నుంచి మార్గశిర, పుష్య మాసాల వరకు స్వాములు నియమనిష్ఠలతో ఉంటారు. అయ్యప్ప దీక్షలో భక్తి, ముక్తితోసహా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత వంటివి మిళితమై ఉంటాయని భక్తుల విశ్వాసం. దీంతో యేటా దీక్షలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి.
– దండేపల్లి, డిసెంబర్ 9
దండేపల్లి, డిసెంబర్ 9 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయ్యప్ప నామ స్మరణే మార్మోగుతోంది. దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ అభినవ శబరిమలై అయ్యప్ప ఆలయంతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని చాంద, ఇచ్చోడ, సుంకిడి.. నిర్మల్ జిల్లాలోని కడ్తాల్, ఖానాపూర్.. మంచిర్యాల జిల్లాలో గూడెంతోపాటు జన్నారం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపెల్లి, చెన్నూర్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో అయ్యప్ప ఆలయాలు ఉన్నాయి. దీక్ష సమయంలో మాలధారణ, దీక్ష విరమణ సమయంలో ఇరుముడి కట్టుకుంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమలై వెళ్లలేని వారు గూడెం అయ్యప్ప ఆలయంలో దీక్ష విరమణ చేస్తారు.
అయ్యప్ప దీక్ష ద్వారా ఎదుటి వారిని గౌరవించడం, సహపంక్తి భోజనాలు చేయడం, సన్నిధానంలో అందరి కాళ్లకు నమస్కరించడం, అందరి ఇళ్లకు వెళ్లి భోజనం చేయడంతో సమాజంలో అందరం ఒక్కటే అన్న భావనను మదిలో పెంపొందించుకుంటారు. తమను తాము నియంత్రించుకోవడానికి ఉపయోగపడుతోంది. కులాల ప్రస్తావన అస్సలు ఉండకూడదు. సామాన్యుడు, పేద, ధనిక అనే తేడా చూపించకూడదు.
41 రోజులపాటు నియమ నిష్ఠలతో దీక్షను చేపట్టి ఆ తరువాత శబరిమలై చేరుకొని స్వామికి ఇరుముడి సమర్పించి, నెయ్యితో అభిషేకం చేశాకే దీక్షను విరమిస్తారు. కానీ.. శబరిమలకి ప్రత్యామ్నాయంగా ఇరుముడి సమర్పణకు అవకాశం ఉన్న ఆలయం గూడెంలో ఉండడం విశేషం. అయ్యప్ప స్వాములు ఇరుముడికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఆ ఇరుముడిని తలపై పెట్టుకొని స్వామి శరణుఘోషతో శబరిగిరికి చేరుకొని ఏకశిలతో రూపొందించిన పదునెట్టాంబడి(పద్దెనిమిది మెట్లు) ఎక్కి ఆ తరువాత దానిని స్వామి వారికి సమర్పించడం, నెయ్యితో అభిషేకం చేశాక కానీ దీక్షను విరమించరు. తెలంగాణలో అయ్యప్ప ఆలయాలు చాలానే ఉన్నా పదునెట్టాంబడి ఉన్నవి చాలా తక్కువ. వాటిలో ప్రముఖమైనది గూడెం శ్రీ అభినవ శబరిమలై అయ్యప్ప ఆలయం.
గోదావరి నదీ తీరంలో మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి దాదాపు 35 కిలో మీటర్ల దూరంలో గూడెం శ్రీ అభినవ శబరిమలై అయ్యప్ప ఆలయం ఉంది. ఇది తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన శ్రీసత్యనారాయణస్వామి ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని అభినవ శబరిమలగా పిలుస్తారు. శబరిమల తరహాలోనే భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. మండల దీక్ష తరువాత ఏ కారణం చేతనైనా శబరిమలకు వెళ్లలేని వారు ఈ సన్నిధానంలోనే ఇరుముడిని సమర్పించి, నెయ్యితో అభిషేకం చేస్తారు. యేటా ఇక్కడ వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి దీక్షను విరమిస్తున్నారు.
గూడెం శ్రీ అభినవ శబరిమలై అయ్యప్ప ఆలయాన్ని 1993లో నిర్మించాం. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లా నుండే కాక కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌కు చెందిన అయ్యప్ప భక్తులు మాలధారణ ఇక్కడే చేసుకుంటున్నారు. శబరిమల వెళ్లలేని చాలా మంది ఇక్కడే దీక్ష విరమణ చేస్తున్నారు. యేటా అయ్యప్ప దీక్షాపరుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 48 సార్లు అయ్యప్ప దీక్ష తీసుకున్నా.
– చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు, గురుస్వామి, గూడెం అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకులు
ఈ యేడాదితో 30వసారి మాలధారణ స్వీకరించా. అయ్యప్ప మాలధారణ స్వీకరించి, నిత్య పూజలతో గడిపితే అంతా మంచే జరుగుతుందని నమ్ముతా. శబరిమల వెళ్లి యేటా దీక్ష విరమిస్తా. కొన్ని సార్లు గూడెంలోనే దీక్ష విరమిస్తున్నా. అయ్యప్ప భక్తులు కచ్చితంగా క్రమశిక్షణ, పరిశుభ్రత పాటించాలి. ఎదుటివారిని గౌరవించాలి. నాలో శక్తి ఉన్నంత వరకు మాల వేస్తూనే ఉంటా.
– పొడేటి లక్ష్మణ్‌గౌడ్, గురుస్వామి, తాళ్లపేట(దండేపల్లి).