మంచిర్యాల అర్బన్ : పర్యావరణ పరిరక్షణలో పక్షుల ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకోవాలని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (Principal Chief Conservator ) డాక్టర్ సువర్ణ ( Suvarna ) అన్నారు. మంచిర్యాలలోని కలెక్టర్ కార్యాలయంలో బర్డ్స్ ఫెస్టివల్‌పై ( Bird Festival ) జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. అటవీ శాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF), నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF) ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీసీఎఫ్ డాక్టర్ సువర్ణ మాట్లాడుతూ పక్షులు ( Birds ) ఎంతో జీవవైవిధ్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మానవాళికి మేలు చేస్తున్నాయన్నారు. పక్షుల సంరక్షణకు, వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి ఇలాంటి బర్డ్స్ ఫెస్టివల్ వర్క్‌షాప్‌లు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. పక్షుల సంరక్షణ ఒక హాబీగా చేసుకోవాలని, ఇందుకోసం కార్పొరేట్ కంపెనీలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.
పర్యావరణంలో పక్షుల శబ్దాలను పరిశీలిస్తూ వాటి గురించి నిపుణుల సహాయంతో తెలియని విషయాలు తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కాకులు చాలా వరకు అంతరించిపోయాయని, కాకి కనపడితే ఒక ఆశ్చర్యంగా చూసే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను దసరా పర్వదినాల్లో బంధించి చూడటం నేరమని, దానిని సహజ సిద్ధంగానే చూడాలని సూచించారు.
సంక్రాంతి పండుగ సమయంలో పతంగుల కోసం వాడే మాంజా దారం వలన ఎన్నో పక్షులు చనిపోతున్నా యని, ఇలాంటి చర్యలు మానుకోవాలని కోరారు. కొన్ని రకాల పక్షులు వేటగాళ్ల బారిన పడి అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో సంచరించే వివిధ రకాల పక్షులతో కూడిన బ్రోచర్ ను విడుదల చేశారు.
వర్క్‌షాప్‌లో దేశం లోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న పక్షుల వివరాలను, వాటి జీవన విధానం, పర్యావరణంలో వాటి పాత్రపై పక్షుల పై పరిశోధనలు చేస్తున్న పలువురు ప్రముఖులు వివరించారు. ఈ కార్యక్రమంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, సీసీ ఎఫ్ శరవణన్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అటవీ శాఖ అధికారులు శివ ఆశిష్ సింగ్, నీరజ్ కుమార్, మంచిర్యాల ఎఫ్‌డీవో సర్వేశ్వర్ రావు, వరల్డ్ వైల్డ్ లైఫ్ అధికారులు ఫరిదా తంపాల్, బండి రాజశేఖర్, స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు.