మంచిర్యాల, జూన్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు రానున్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో జూన్ 1న సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహించనున్నారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై.. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, సింగరేణి కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, తప్పుడు బొగ్గు నిల్వలు, సింగరేణిపై పడుతున్న ఆర్థిక భారం, మెడికల్ బోర్డు రద్దు చేసేందుకు సర్కారు చేస్తున్న కుట్రలు, కేసీఆర్ హయాంలో ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగాలపై విజిలెన్స్ విచారణ పేరుతో వేధింపులు, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బాకాయి పడ్డ రూ.54 వేల కోట్లు, మారుపేర్లు, విజిలెన్స్ కేసులు, కార్మికులను అక్రమంగా చేసే డిస్మిస్లు, తదితర అంశాలపై ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి కార్మికులకు వివరించనున్నారు.
సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సులో హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి, యూనియన్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొననున్నారు. సింగరేణి పరిరక్షణ సదస్సును విజయవంతం చేయాలంటూ యూనియన్ నాయకులు శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటి సింగరేణి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో కార్మికవర్గం ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలిరానున్నది.