‘మేం ఎట్లా బతకాలి.. ప్రయాణికులు లేక తల్లడిల్లుతున్నం.. ఫైనాన్స్ కట్టలేని దుస్థితిలో ఉన్నం.. కుటుంబాలు రోడ్డున పడేపరిస్థితి ఉంది.. ఉచిత బస్ ప్రయాణంతో నష్టపోతున్నం..’ అంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాండు ఎదుట ఆటోడ్రైవర్లు సోమవారం నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడంతో గిరాకీ లేకుండా పోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ప్రయాణం నిలిపివేసి, బస్సు చార్జీలు తగ్గించాలని కోరా రు. ఆటోడ్రైవర్లకు కూడా ప్రభుత్వం భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఆటో యూనియన్ డ్రైవర్లు పాల్గొన్నారు.
– ఖానాపూర్, డిసెంబర్ 11
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం సంతోషకరమే. అయితే అదే సమయంలో ఆటోలు ఇతర వాహనాలపై ఆధారపడి జీవిస్తున్న వేల కుటుంబాలు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఆటోలు, జీపులు, క్యాబ్‌లు సహా ఇతర వాహనాలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు.

కొంత మంది ఫైనాన్స్‌తో ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెలా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే తమ ఆటోల కొనుగోళ్లకు అప్పుగా తీసుకున్న ఫైనాన్స్ చెల్లించడం, కుటుంబాలను పోషించడం తమకు భారమవుతుందని అంటున్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు అనేవి ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయని చెప్పే ప్రయత్నంలో వారి అభిప్రాయాలు.
నేను ఆదిలాబాద్ నుంచి రుయ్యాడి గ్రామానికి ఆటో నడుపుతాను. కాగా ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. అయితే ఈ నిర్ణయంతో నష్టపోతున్న ఆటోవాలాలను కూడా ఆదుకుంటే బాగుంటుంది. రోజుకు రూ.600 నుంచి రూ.700 వరకు వచ్చేవి. ఇప్పుడు ఆటోకు డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. ఇంకొన్ని రోజులు ఇలాగే కొనసాగితే మేము ఆటోలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మా జీవనోపాధి కోసం ఒక పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.
– పులి ఆశన్న, ఆటో డ్రైవర్, ఆదిలాబాద్
రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం మంచిదే. అయితే అప్పటి నుంచి మా ఆటోలు నడిపే వారికి చాలా కష్టం అవుతుంది. మహిళలు ఆటోలో ప్రయాణించకపోవడంతో ప్రస్తుతం తాము రోజుకు రూ.200 కూడా ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి వచ్చింది. దీంతో మేము జీవనోపాధి కోల్పోతున్నాం. ప్రభుత్వం ఆటో వాలాలకు కూడా ఒక భరోసా పథకం అమలు చేయాలని కోరుతున్నాం.
– హీరాసింగ్, ఆటోడ్రైవర్, ఆదిలాబాద్
నేను ఆదిలాబాద్ నుంచి కప్పర్లకు ఆటో నడుపుతాను. గత 15 ఏళ్లుగా ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో జీవనోపాధి కోల్పోతున్నాం. గిరాకీలు లేక ఇబ్బందులు పడుతున్నాం. దీంతో ఆటోకు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి ఎదురవుతుంది. కుటుంబ పోషణ భారం అవుతుంది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం.
– గణేశ్, ఆటో డ్రైవర్, ఆదిలాబాద్