ఎదులాపురం, ఏప్రిల్25: ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 12 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని, పోలీస్ శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరించారు. అంతకుముందు కేసుల వారీగా సంబంధించిన అంశాలను పోలీస్, రెవెన్యూ ,సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్,ఎస్పీలు సమీక్షించారు.
మలేరియా రహిత సమాజానికి కృషి
మలేరియా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యాఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని కొత్తకుమ్మరివాడలో అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి ఆవరణల్లోని డబ్బాలు, పూలకుండీలు, ట్రైర్లలో నిల్వ ఉన్న నీటిని కలెక్టర్ పారబోశారు. మలేరియా నివారణపై జిల్లాలోని అన్ని పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వారంలో ఒకరోజు డ్రైడే పాటిచాలని సూచించారు. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులు గేయాలు ఆలపించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఐటీడీఏ డీడీ డాక్టర్ దిలీప్‌కుమార్, ఆర్డీవోలు రమేశ్ రాథోడ్, కదం సురేశ్, డీఎస్పీలు వీ ఉమేందర్, నాగేందర్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, డీఎంవో ఎం శ్రీధర్, డీఐవో వైసీ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖల అధికారులు సునీతకుమారి, రాజలింగం, కృష్ణవేణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్, ఐటీడీఏ ఏవో రాంబాబు, ఉట్నూర్ ఎంపీడీవో తిరుమల, కమిటీ సభ్యులు ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ శైలజ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నరేందర్, మెడికల్ ఆఫీసర్ అలేఖ్య, కౌన్సిలర్ మిషూ, శాంతినగర్ పీహెచ్సీ సిబ్బంది సీవో కేమ రాజారెడ్డి, అనిల్, ఆశ కార్యకర్తలు ఉన్నారు.