నార్నూర్, సెప్టెంబర్ 15 : ఆదివాసీ నాయకులను విమర్శిస్తే సహించేది లేదని రాజ్ గోండు సేవా సమితి నార్నూరు మండల అధ్యక్షుడు ఆత్రం పరమేశ్వర్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కుమ్రం భీం భవన్లో రాజ్ గోండు సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కుమ్రం భీం విగ్రహం వద్ద విలేకరులతో మాట్లాడారు. లంబాడీలు కర్ణాటక, మహారాష్ట్ర ఇతర ప్రాంతాలలో బీసీలుగా ఉన్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చి ఎస్టీలుగా చలామణి అవుతూ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారన్నారు.
దీంతో స్థానికంగా ఉండే ఆదివాసులకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాథోడ్ చారులత వలస వచ్చి ఉట్నూర్ లో జడ్పిటిసిగా పని చేసిందన్నారు. చారులత ఆదివాసి నాయకులను విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నామన్నారు. ఆదివాసుల జోలికి వస్తే తమ గ్రామాలలో కూడా తిరగనివ్వమని స్పష్టం చేశారు. ఇక స్థానిక ఎన్నికల్లో లంబాడీలకు ఆదివాసులు ఓట్లు వేయరని, ఇతర పార్టీలు సీట్లు ఇవ్వకూడదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కనక హన్మంతరావు, సెడ్మాకి భీం రావ్, తుడుం దెబ్బ మండల కార్యదర్శి మెస్రం మోతిరామ్, అర్కా గోవింద్, కోట్నాక్ దేవిదాస్, మెస్రం జంగు, మడవి ప్రతాప్, సూర్యారావు తదితరులున్నారు.