మంచిర్యాల, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా గర్మిళ్ల శివారులోని సర్వే నం. 315లోని ఓ పట్టా భూమిపై స్థానిక ప్రజాప్రతినిధి సామాజిక వర్గ పెద్దల కన్ను పడింది. ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటూ పట్టాదారుడిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ భూమిలోకి చొరబడగా, ఈ విషయంపై బాధితుడి పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. అన్ని డాక్యుమెంట్లు చూపించినా, తహసీల్దార్ సైతం ఆ భూమి పట్టాదారుకు చెందినదే అని తేల్చి చెప్పినా ప్రయోజనం లేదు. పైగా పట్టాదారు కేసు పెట్టిన మరుసటి రోజే.. ఆక్రమణదారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరిగి పట్టాదారుపైనే కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
కేసు పెట్టి ఏడు నెలలు గడిచిపోతున్నా.. కాలయాపన చేస్తూ ఆక్రమణదారులకే అధికారులు సహకరిస్తున్నారంటూ బాధితుడు వాపోతున్నాడు. 20 ఏండ్ల క్రితం భూమి కొనుగోలు చేసిన నాటి నుంచి ఇంటి పన్ను, నల్లా పన్ను, వెకెట్ ల్యాండ్ ట్యాక్స్, కరెంట్ బిల్లులు కడుతూ వస్తున్నానని పట్టాదారు పూదరి మల్లాగౌడ్ చెబుతున్నారు. పట్టాదారు నుంచి తాను కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయని, కబ్జా చేసిన వారి దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో పట్టుకొని రావాలంటూ సవాల్ చేస్తున్నారు. అసలు సర్వే నం.315లోని భూమి ఎవరిది.. కబ్జాకు ప్రయత్నిస్తున్న ఆ సామాజిక వర్గ పెద్దలు ఎవరు.. ఏం జరిగింది.. పోలీసులు ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
గర్మిళ్ల శివారులోని సర్వే నం.315లో రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే సేత్వార్ ప్రకారం 315/అ సర్వే నంబర్లో ఆకుల నారాయణ పట్టేదారుగా ఉన్నారు. 1954 కాస్రా పహణీ ప్రకారం ఈ సర్వే నంబర్లో ఆకుల నారాయణకు రెండు ఎకరాల 34 గుంటలు ఉంది. ఈ సర్వే నంబర్లో 26-367,26-368 ఇంటి నంబర్లతో రెండు ఇండ్లు సైతం ఉన్నాయి. ఈ ఇండ్లు దాదాపు 120 సంవత్సరాలుగా ఉంటున్నాయి. 315/అ సర్వే నంబర్లో ఎకరంపావు 6,665 గజాల భూమిన ఆకుల నారాయణ వారసులు 2007లో పూదరి కళావతి (పట్టాదారు పూదిరి మల్లాగౌడ్) భార్యకు విక్రయించారు.
ఈ మేరకు డాక్యుమెంట్ నంబర్లు 7749/2007, 8380/2007 ద్వారా సేల్ డీడ్ సైతం చేసుకున్నారు. అదే భూమిని 865/2015, 4153/2018 ద్వారా పూదిరి మల్లాగౌడ్ జీపీఏ చేసుకున్నారు. ఆ భూమిలోని రెండు ఇండ్లను సైతం తన పేరుమీదకు మార్చుకున్నారు. 20 ఏండ్లుగా అక్కడే ఉంటూ మున్సిపాలిటీకి ప్రాపర్టీ ట్యాక్స్, వెకెట్ ల్యాండ్ ట్యాక్స్, నల్లా పన్ను, రెండు ఇండ్లకు కరెంట్ బిల్లులు కూడా కడుతూ వస్తున్నారు. రెవెన్యూ రికార్డు, మున్సిపాల్ రికార్టులు ఏం చూసుకున్నా ఇది స్పష్టంగా తెలిసిపోతున్నది.
ఈ క్రమంలో 2024 నవంబర్ 8న మధ్యాహ్నం 12.45 జీవీ ప్రశాంత్‌రావు అనే వ్యక్తి పది నుంచి పదిహేను మం దితో ఓ జేసీబీ, తార్ వాహనంలో వచ్చి 315/అలో మల్లాగౌడ్కు సంబంధించిన భూమి మెయిన్ గేట్ తాళాలు పగులగొట్టి దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించాడు. జేసీబీతో భూమి లోపల మొత్తం చదును చేయడం మొదలుపెట్టారు. దీనిపై పట్టాదారు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశా రు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ తిరిగి మల్లాగౌడ్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఘటనా స్థలానికి వెళ్లి తిరిగి కాల్ చేస్తానని చెప్పాడు. కానీ గంట సమయం గడిచిన ఎలాం టి స్పందన లేకపోవడంతో బాధితుడు మంచిర్యాల ఏసీపీ, సీఐలకు వాట్సాప్ మేసేజ్, టెక్ట్ మెసేజ్ పెట్టి ఇద్దరి అధికారులతో ఫోన్లో మా ట్లాడారు. ఏవైనా డాక్యుమెంట్లు ఉంటే సాయ ంత్రం వచ్చి కలవమని ఏసీపీ, సీఐ చెప్పడంతో వారి సూచనల మేరకు వెళ్లి కలిశాడు. ఆయన డాక్యుమెంట్లు పరిశీలించిన అ నంతరం అధికారులకు ఇప్పటికీ జేసీబీ తన భూమిలోనే పని చేస్తుందని, ఆ మిషన్‌ను కస్టడీలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియాలు, వాహనాల నంబర్లు.. ఇలా అన్ని ఆధారాలు పోలీసులకు సమర్పించారు.
దీంతో అర్ధరాత్రి 12.30 గంటలకు మల్లాగౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు జేసీబీ, తార్ వాహనాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది చేస్తున్నది ప్రశాంత్‌రావు అని.. తెల్లారి ఆయన్ని పిలిస్తామమని, నువ్వు కూడా రావాలని చెప్పారు. ఈ మేరకు బాధితుడు ఉదయాన్నే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా మల్లాగౌడ్ డాక్యుమెంట్లను మరోసారి పరిశీలించిన పోలీసులు ప్రశాంత్‌రావును డాక్యుమెంట్లు చూపించాలని కోరారు. కానీ ఆయన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో ఎఫ్ఐఆర్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ డాక్యుమెంట్లను తహసీల్దార్ ఒపీనియన్ కోసం పంపిస్తామని చెప్పారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. బాధితుడు మల్లాగౌడ్ దౌర్జన్యంగా వచ్చి మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి సర్వే నంబర్ 315/బీలోని తన భూమిలోకి వచ్చాడంటూ ప్రశాంత్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బాధితుడిపైనే ఉల్టాకేసు నమోదు చేయడం కొసమెరుపు. ఒకరోజు ముందే మల్లాగౌడ్ పోలీసులు ఫిర్యాదు చేయగా, మరుసటి రోజు 9న బాధితుడిపైనే కేసు నమోదు చేశారు. 8న మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రశాంత్‌రావు తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా తన భూమిలోకి వచ్చాడని పట్టాదారు ఫిర్యాదు చేస్తే, 9న ప్రశాంత్‌రావు 8న సాయంత్రం 4 గంటలకు మల్లాగౌడ్ వచ్చి తాళాలు పగలగొట్టినట్లు ఫిర్యాదు చేశారు.
మల్లాగౌడ్ 100కు ఫోన్ చేయడం, పోలీసులు ఆధారాలన్నీ సమర్పించడం చేసినా.. ఉల్టా ఆయనపైనే కేసు ఎందుకు నమోదు చేశారన్నది అర్థం కాకుండా పోయింది. పైగా ప్రశాంత్‌రావు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న గర్మిళ్ల శివారులో సర్వే నం. 315/బీ అనేది అసలు రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా లేదు. తహసీల్దార్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సర్వే నంబర్ 315/అలో సేత్వార్, కాస్రా పహణీలో 2.34 గుంటలకు ఆకుల నారాయణ పట్టాదారుగా ఉన్నారని తేల్చిచెప్పారు.
ఆయన నుంచి ఆ భూమి మల్లాగౌడ్కు వెళ్లింది. రికార్డుల్లోనూ ఇదే ఉంది. కానీ పోలీసులు మాత్రం బాధితుడిపై కేసు నమోదు చేయడం.. తహసీల్దార్ డిక్లరేషన్ ఇచ్చినా మల్లాగౌడ్పై కేసును కొట్టివేయకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది. ఈ వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకు ఇవన్నీ బలం చేకూరుస్తున్నాయి.
ఈ వ్యవహారంలో పట్టాదారును ఎమ్మెల్యే అనుచరులమంటూ కొందరు బాధితుడిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తున్నట్లు సమాచారం. కాకపోతే నిజంగానే ఈ వ్యవహారం వెనుక ఎమ్మెల్యే ఉన్నారా లేదా అనే విషయం లో స్పష్టత లేదు. కాకపోతే ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా ఉండే ఓ సారు ఈ వ్య వహారాన్ని ముందు ఉండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఒత్తిడి మేరకు పోలీసులు ఏం చేయలేకపోతున్నారని తెలుస్తున్నది. ఎవరున్నా సరే పట్టాభూమిని కబ్జా చే యాలని చూడడం అన్యాయమని స్థానికులు అంటున్నారు. ఒకవేళ నిజంగా ఎమ్మెల్యే లేకపో తే ఈ విషయంలో బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు. ఏడు నెలలుగా కేసును ఎటూ తేల్చని పోలీసులు బాధితుడికి న్యాయం చేస్తారా.. లేదా అన్నది వేచి చూడాల్సి ఉన్నది.
గర్మిళ్ల శివారులోని సర్వేనం.315/అలోని భూమి నాది. ఇది ఎక్కడికైనా వచ్చి నిరూపించడానికి నేను సిద్ధం. రెవెన్యూ రికార్డులు, నా డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయి. పోలీసులకు సైతం అవి సమర్పించాను. తహసీల్దార్ కూడా ఆ విషయాన్ని తేల్చి చెప్పారు. కానీ ఏడు నెలలుగా ఈ కేసును ఎందుకు పెండింగ్ పెడుతున్నారో అర్థం కావడం లేదు. సీపీ అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు చేపట్టాక వెళ్లి కలిశాను. సార్ సీరియస్‌గా చెప్పినా ఫలితం లేదు. ఒకవేళ ప్రశాంత్‌రావు ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే చూపించమనండి. అసలు ఆయన చెప్పిన సర్వేనంబర్ 315/బీ రెవెన్యూ రికార్డుల్లోనే లేదు. నేను కేసు పెట్టినప్పుడు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు అన్ని ఆధారాలు సమర్పించా.
మరి ప్రశాంత్‌రావు ఏం సమర్పించారో చెప్పాలి. నాపై పెట్టింది తప్పుడు కేసు అని పోలీసులకు సైతం తెలుసు. కానీ ఉద్దేశ పూర్వకంగానే కాలయాపన చేస్తున్నారు. నాది తప్పైతే నన్ను అరెస్టు చేయాలి. అదే ప్రశాంత్రావుది తప్పైతే ఆయన్ని అరెస్టు చేయాలి. కానీ ఏడు నెలలు అవుతున్నా ఎందుకు ఆపుతున్నారో పోలీసులే సమాధానం చెప్పాలి. సీపీసార్, ఎమ్మెల్యే సార్ నాకు న్యాయం కావాలి. నా తప్పు ఉంటే నన్ను లోపల వేయండి. లేకపోతే నన్ను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోండి. ఏడు నెలలుగా ఎదురు చూసి న్యాయం జరగకపోవడంతో మీడియాను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పటికైనా నాకు న్యాయం చేయాలి. – మల్లాగౌడ్, బాధితుడు