రెబ్బెన, మే 10 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండ లం తుంగెడ గ్రామ శివారులోగల 417 కంపార్టుమెంట్‌లోని భూమి లో శుక్రవారం అటవీశాఖ అధికారులు, పోడు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. పోడు భూముల విషయమై నెల రోజులుగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతుండగా, శుక్రవారం చిలికి చిలికి గాలివానలా మారి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది. తుంగెడ గ్రామానికి చెందిన పలువురు రైతులకు 1988లో అప్పటి సర్కారు భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పట్టాలు అందించింది. అప్పటి నుంచి రైతులు ఆ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో పలువురు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లగా, సదరు భూముల్లో చెట్ల పొదలు పెరిగాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొందరికి పట్టాపాసు పుస్తకాలు మంజూరు కాగా, మరికొందరికి ఇవ్వలేదు. ఈ విషయమై రైతులు కలెక్టర్, తహసీల్దార్ దృష్టికి తీసుకవెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా అక్కడి భూముల్లో సాగు కోసం రైతులు చెట్లు నరికి వేస్తుండగా, అటవీశాఖ అధికారులు అడ్డుకుంటూ వస్తున్నారు. పలుమార్లు అటవీశాఖ అధికారులు, రైతులకు మధ్య చర్చలు, సమావేశాలు జరిగినా సమస్యకు పరిష్కారం లభించలేదు.
జాయింట్ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు, అటవీశాఖ భూములేవి తేల్చాల్సి ఉండగా, అధికారులు కాలయాపన చేయడంతో సమస్య జఠిలమైంది. పోడు వ్యవసాయం చేసేందుకు యత్నించిన పలువురు రైతులపై అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసి, 41(ఏ) సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులు తీసుకునేందుకు రైతులు నిరాకరించారు. ఈ క్రమంలో శుక్రవారం అటవీశాఖ అధికారులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొని ఘర్షణకు దారితీసింది. పలువురు అధికారులు, రైతులకు స్వల్పగాయాలయ్యాయి.
రెబ్బెన పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. రెబ్బెన ఇన్చార్జి రేంజ్ అధికారి శ్రీధరాచారి ఫిర్యాదు మేరకు 11 మంది రైతులపై కేసు నమోదు చేసినట్లు రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. సుమారు 30 మంది రైతులు సైతం ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రెబ్బెన సీఐ చిట్టిబాబు, ఎస్ఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయాన్ని ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్యకు ఫోన్ ద్వారా తెలపడంతో ఆయన కూడా అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ఎఫ్డీపీటీ శాంతారాం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ గాయపడిన అటవీశాఖ అధికారులను పరామర్శించారు.
మంచిర్యాల ఏసీసీ, మే 10 : తుంగెడ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బందిపై గొడ్డళ్లు, కర్రలతో దాడి చేయడం దారుణమని అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) మంచిర్యాల ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో ఖండించారు. చట్టంలో లోపాల వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే అటవీ శాఖ సిబ్బందికి ప్రభుత్వం, అటవీశాఖ అండగా నిలవాలని, ఇలాంటి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.