కాగజ్‌నగర్, జూలై 8 : ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యనందించి, రుచికరమైన భోజనం పెట్టాలని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం కాగజ్‌నగర్ పట్టణంలోని పాత ప్రభుత్వ ఉన్నత ప్రధానమంత్రి శ్రీ పాఠశాలను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, మధ్యా హ్న భోజనం నాణ్యత, వంటశాల, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మూత్రశాలలు, మరుగుదొడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి, వినియోగంలోకి తీసుకురావాలని, కాలం చెల్లిన నిత్యావసర సరుకులను వినియోగించకూడదని, వంటశాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
10వ తరగతి గదిని సందర్శించారు. గంజాయివంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఏకాగ్రతతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం త్రిశూల్ పహాడ్‌పై న ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్వయం ఉపాధి, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌పై ఇస్తున్న శిక్షణను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తులు, సాదా బైనమా దరఖాస్తుల ప్రక్రియ, కార్యాలయ రికార్డులు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. డిప్యూటీ తహసీల్దార్, ఎంఈవో, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.