కుమ్రం భీం ఆసీఫాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలకు పది రోజులే గడు వు ఉండడంతో అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా పచారాలు సాగిస్తున్నారు. కుమ్రం భీ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు తోడుగా వారి కుటుంబ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సిర్పూర్ అభ్యర్థి కోనేరు కోనప్పకు వారి కుటుంబ సభ్యులు తోడుగా ఉంటూ ప్రచారాన్ని సాగిస్తుంటే.. ఆసిఫాబాద్ అభ్యర్థి కోవ లక్ష్మికి తోడుగా ఆమె కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో విజయం కోసం కోనేరు కోనప్ప నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచారం చేస్తుంటే ఆయన తోడుగా కుటుంబసభ్యులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కోనేరు కోనప్ప పర్యటనలు నిర్వహిస్తూ ప్రజలకు పదేళ్లుగా తాను చేసిన అభివృద్ధిని వివరిస్తుంటే.. కుటుంబ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. కోనేరు కోనప్ప సతీమణి రమాదేవి, కుమారుడు కోనేరు వంశీ కూడా ప్రచారాల్లో పాల్గొంటూ కోనప్ప విజయం కోసం కృషిచేస్తున్నారు.
కోనేరు కోనప్ప విజయం కోసం ఆయన సతీమని కోనేరు రమాదేవి ఓటర్ల ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. కాగజ్‌నగర్ పట్టణంతో పాటు, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మహిళలను ఆప్యాయంగా పలుకరిస్తూ బొట్టుపెట్టి ఓట్లు అడుగుతున్నారు. కోనప్ప సాధించిన మూడు సార్లు విజయాల్లో తన వంతు సహకారాన్ని అందించిన రమాదేవి ముచ్చటగా నాలుగోసారి కోనప్ప విజయం సాధించేందుకు నిరంతరం కృషిచేస్తున్నారు. కాగజ్‌నగర్‌లోని వీధుల్లో పర్యటిస్తూ గడపగడపకూ వెళ్తున్నారు.. మహిళలను, పెద్దలను, యువకులను ఆకట్టుకొంటూ తనదైన రీతిలో ప్రచారం సాగిస్తున్నారు.
భర్త విజయం కోసం గత నెల రోజులుగా కోనేరు రమాదేవి కాగజ్‌నగర్ పట్టణంలో ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. రమాదేవి ఏ వాడకు వెళ్లి పెద్ద సంఖ్యలో గుమిగూడి మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల్లో తన తండ్రి కోనేరు కోనప్ప విజయం కోసం కుమారుడు కోనేరు వంశీ రాత్రి పగలు తేడా లేకుండా ప్రచారాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు యువజన సంఘాల నేతలతో, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున యువతను ప్రోత్సహిస్తున్న వంశీ తన ఆధ్వర్యంలో గ్రామాల్లో యువకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు..
ఆసిఫాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి తోడుగా ఆమె కూతురు అరుణతోపాటు చెల్లెలు సరస్వతి ప్రచారం సాగిస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ కోవలక్ష్మి విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కోవలక్ష్మి చెల్లెలు మర్సుకోల సరస్వతి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరడంతో స్థానికంగా బీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. కోవలక్ష్మి విజయం కోసం కుటుంబ స భ్యులు నియోజవర్గంలోని మండలాల్లో పర్యటి స్తూ ఇంటింటికీ వెళ్తున్నారు. కోవలక్ష్మికి విజయా న్ని అందించేందుకు కుటుంబసభ్యులు అండగా ఉంటూ ప్రచారాలు చేస్తున్నారు. కోవ లక్ష్మి గత రెండు నెలలుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది కుటుంబసభ్యులు కూడా తోడు కావడంతో బీఆర్ఎస్ ప్రచారం మరింత ముమ్మరంగా సాగుతోంది.