తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆశ కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తలు మాట్లాడుతూ.. ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ప్రమాదబీమా, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పక్షం రోజులు సమ్మె చేయగా ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
– నిర్మల్ చైన్‌గేట్, జూలై 22
కాంగ్రెస్ ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలు, ఫిబ్రవరి 9న ఆరోగ్యశాఖ కమిషనర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పారితోషికం రూ.18 వేలకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆశ వర్కర్లకు ఇన్సూరెన్సు రూ.50 లక్షలు చెల్లిస్తూ సర్క్యులర్ జారీ చేయాలి. రిటర్మైంట్ బెన్ఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ చెల్లించాలి.
– బి.సుజాత, జిల్లా ఆశ కార్యకర్తల యూనియన్ గౌరవ అధ్యక్షురాలు.
ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించా లి. గత ప్రభుత్వం ఇచ్చినట్లు ఆశలకు ప్రతినెల 2న పారితోషికాలు చెల్లించాలి. 18 రకాల రిజిస్టర్లు రాయా లని చెబుతున్నా ఇంతవరకు రిజిస్టర్లు ఇవ్వలేదు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశలకు మట్టి ఖర్చులు రూ.50 వేలు చెల్లిస్తూ సర్క్యులర్ వెంటనే జారీ చేయాలి. యేటా 20 రోజులు వేతనంలో కూడిన సెలవులు ఇవ్వాలి.
– పి.గంగమణి, ఆశ కార్యకర్తల యూనియన్ జిల్లా కార్యదర్శి.
రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలు చేయకపోతే ఈ నెల 30వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామ న్నాం. ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఆశల సమస్యలు పరి ష్కరించాలి. సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు అనేకసార్లు ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులకు అనేక వినతులు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపినా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదు.
– బి. ఇంద్రమాల, ఆశ యూనియన్ నాయకురాలు
ఆశ కార్యకర్తలను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. జిల్లా అధికారులు ఆశలతో స్ఫూటమ్ డబ్బాలను మోయించవద్దని సర్క్యులర్ జారీ చేయాలి. జిల్లా, మండల కేంద్రాల్లో ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి. ఆశల పారితోషికాలు గైడ్‌లైన్స్‌కు భిన్నంగా ఏఎన్సీ టార్గెట్లు ఎక్కువ చేయాలని ఆశలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆశలకు రెస్టు రూంలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెస్టురూంలు కేటాయించిన ప్రాంతాల్లో ఇతరులకు ప్రవేశం కల్పించవద్దు.
– చంద్రకళ, ఆశ కార్యకర్తల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు.