నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 10 : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా పోలీసులు దాడి చేసి, అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా మంగళవారం మంచిర్యాల జిల్లాలో పలు మండలాల్లో ఆశ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హాజీపూర్‌లోని పీహెచ్సీ ఎదుట నిరసన ఆశకార్యకర్తలు తెలుపగా వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నస్పూర్ పీహెచ్సీ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆశకార్యకర్తలు నిరసన తెలిపారు.
దండేపల్లి మండలం నుంచి సీఐటీయూ పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్తున్న ఆశ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) జిల్లా కార్యదర్శి అల్లి సునీత, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆరాల వాణి మాట్లాడుతూ కాంగ్రెస్ మ్యానిఫెస్టో, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం ఆశ కార్యకర్తలకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలు అని చూడకుండా చేయిపట్టి, చీర లాగడం లాంటి దుశ్చర్యలకు పోలీసులు పాల్పడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.