నిర్మల్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతమైన నియోజకవర్గంగా పేరున్న నిర్మల్‌లోని గ్రామీణ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. సాగునీరు, కరెంటు సమస్యలతో అన్నదాతలు దశాబ్దాలుగా అవస్థలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ సాగు నీరు, కరెంటు రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం వరంగా మారింది. తలాపున గోదారి ప్రవహిస్తున్నప్పటికీ పొలాలకు నీరందక ప్రతి ఏటా ఇక్కడ కరువు పరిస్థితులే కొనసాగేవి. సీఎం కేసీఆర్ చొరవతో సాగునీరు, కరెంటు రంగానికి భారీగా నిధులు కేటాయింటారు. దీనిని ఆసరాగా చేసుకున్న జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ప్రతిపాదన మేరకు సీఎం కేసీఆర్ అవసరమైన నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు.
సీఎం హామీతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ నంబర్ 27 హై లెవెల్ కాలువ నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇందులో భాగంగానే శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేశారు. ఈ పథకం కింద నిర్మల్ నియోజకవర్గంలోని దాదాపు 50 వేల ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగు నీరు అందనుంది. నియోజకవర్గంలోని దిలావర్పూర్ మండలం గుండంపెల్లి వద్ద ప్రారంభమయ్యే ఈ కాలువను ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకానికి అనుసంధానం చేసి ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. కాగా ఈ హై లెవెల్ కాలువ దిలావర్పూర్, నర్సాపూర్, కుంటాల మండలాలతోపాటు, సారంగాపూర్, నిర్మల్, మామడ, లక్ష్మణచాంద, సోన్ మండలాల్లోని పొలాలకు వానకాలం, యాసంగి సీజన్లకు సరిపడే సాగునీటిని అందించనుంది.
అలాగే మామడ మండలం పొన్కల్ వద్ద రూ.600 కోట్లతో నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ ద్వారా నియోజకవర్గంలోని 18 వేల ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగు నీరు అందనుంది. ఈ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. అంతేకాకుండా రూ.74 కోట్లతో 179 చెరువులను ఇప్పటికే పునరుద్ధరించడంతో దాదాపు 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతున్నది. దీంతోపాటు స్వర్ణ వాగుపై ఇప్పటికే రూ.46 కోట్లతో ఎనిమిది చోట్ల చెక్‌డ్యాంలను నిర్మించగా, తాజాగా ఇదే వాగుపై మరో ఐదు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి రూ.28 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీంతో ఓ వైపు సాగునీరు అందుబాటులోకి రాగా, మరోవైపు భూగర్భ జలాల వృద్ధికి ఈ చెక్‌డ్యాంలు దోహద పడుతున్నాయి. పశువులకు ఎండాకాలంలో కూడా తాగునీరు లభిస్తున్నది.
నిర్మల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిల ప్రత్యేక చొరవ కారణంగా ఏళ్ల నుంచి వెంటాడిన కరెంటు కష్టాలకు కాలం చెల్లింది. వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న సీఎం కేసీఆర్, అదే తరహాలో నిర్మల్ నియోజకవర్గానికి కూడా వరాల జల్లు కురిపించారు. రామగుండం విద్యుత్ కేంద్రం నుంచి నిర్మల్ నియోజకవర్గానికి నేరుగా విద్యుత్ సరఫరా కోసం సోన్ మండలం వెల్మల్ బొప్పారం వద్ద రూ.1,160 కోట్లతో 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను నిర్మించారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణంతో విద్యుత్ సరఫరాకు ఏళ్ల నుంచి ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోయి, నాణ్యమైన కరెంటు నిరాటంకంగా సరఫరా అవుతున్నది.
అలాగే రూ.10 కోట్లతో సారంగాపూర్ వద్ద నిర్మించిన 133 కేవీ సబ్ స్టేషన్‌తో మండలంలోని మారుమూల పల్లెలు, తండాలు, గూడేలకు కరెంటు కష్టాలు తొలిగాయి. కాగా, నియోజకవర్గంలోని రైతాంగానికి, ఆవాసాలకు నాణ్యమైన కరెంటును సరఫరా చేసేందుకు రూ.22 కోట్లతో 16 సబ్ స్టేషన్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఇలా విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలతో సాగునీటి రంగానికి 24 గంటలపాటు కరెంటును నిరాటంకంగా సరఫరా జరుగుతోంది. మొత్తానికి సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిల కృషి మేరకు నిర్మల్ నియోజకవర్గం సాగునీరు, కరెంటు కష్టాలను అధిగమించి సస్యశ్యామలంగా మారింది.
నిర్మల్ జిల్లాలో వైద్యరంగానికి మహర్దశ పట్టింది. సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కృషి మేరకు జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కాగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ తరగతుల నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) అనుమతులు జారీ చేసింది. నిర్మల్ శివారులోని భీమన్న గుట్ట ప్రాంతంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ భవనంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఇక్కడి కళాశాలలో సమకూర్చారు. సీఎం కేసీఆర్ గత సెప్టెంబర్‌లో ఈ మెడికల్ కాలేజీని అధికారికంగా హైదరాబాద్ నుండే వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. కాగా, ఏళ్ల నుంచి జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలన్న స్థానికుల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది.
ఇక్కడి ప్రజల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నిజం చేశారని స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు వైద్యవిద్య చేరువైందంటున్నారు. ఈసారి జరిగిన ఎంబీబీఎస్ అడ్మిషన్లలో నిర్మల్ ప్రాంతానికి చెందిన కొంత మంది విద్యార్థులు నీట్ ద్వారా మెరుగైన ర్యాంకులు సాధించి, ఇక్కడే సీట్లు దక్కించుకోవడం ఈ ప్రాంతానికే గర్వకారణంగా నిలుస్తున్నది. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇప్పటికే అభినందించారు. కాగా, మెడికల్ కాలేజీ ఏర్పాటుతో నిర్మల్ జిల్లా కేంద్రంలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని రకాల స్పెషలిస్టు వైద్యులు ప్రొఫెసర్ల రూపంలో అందుబాటులోకి రానున్న కారణంగా ఇక్కడి పేద, మధ్య తరగతి ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందనున్నది.