ఎదులాపురం,జనవరి11: ఈనెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ డైరెక్టర్ లెప్రసీ, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ జాన్‌బాబు అన్నారు. కంటివెలుగు ప్రారంభం ఏర్పాట్లు, సౌకర్యాలు, వసతులను జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ మెట్పెల్లివార్ శ్రీకాంత్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. ముందుగా పట్టణంలోని అన్ని యూపీహెచ్‌సీలు, అంకోలి, ఇచ్చోడ, గుడిహత్నూర్ పీహెచ్‌సీలను పరిశీలించారు. లబ్ధిదారుల పేర్లు, నమోదు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కళ్లద్దాలు, ఏఆర్ యంత్రాలు, క్యాంప్ ఏర్పాటు చేసే ప్రాంతంలో వసతులు ఏర్పాట్లు చేయాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. శిబిరానికి వచ్చే వారందరికీ పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలు ఇవ్వాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు సహకరించాల ని కోరారు. ఆయన వెంట నేత్ర వైద్య నిపుణుడు జే లింగేశ్, డీపీఎంవో మధుసూదన్‌రావు ఉన్నారు.
లోటుపాట్లు లేకుండా చూడాలి
కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై ఉన్నతాధికారులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా డీఎంహెచ్వోలతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ తెలిపారు. కంటివెలుగు ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం వైశాలి ఉన్నారు.