మంచిర్యాల, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ భూములు జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రెస్‌మీట్ పెట్టిన ప్రతిసారి చెబుతున్నారు. మా పార్టీ వాైళ్లెనా, వేరే పార్టీ వాైళ్లెనా ఎవరైనా సరే ఉపేక్షించమంటున్నారు. ఇలా ఎమ్మెల్యే చెబుతున్న మాటలు ఉత్తవేనా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. గర్మిళ్ల శివారు కాలేజీరోడ్‌లో ఏకలవ్య ఆశ్రమం పక్కనున్న భూదాన్ ట్రస్ట్ భూములు కబ్జా అవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదనేది అర్థం కావడం లేదు.
ఏకలవ్య ఆశ్రమాన్ని ఆనుకొని ఉన్న సర్వే నంబర్లు 707, 708, 65లో దాదాపు 40 ఎకరాల భూదాన్ ట్రస్ట్ భూమి ఉంది. ఇందులో కొంత మొత్తాన్ని ఎంసీహెచ్‌కు, ఇటీవల కాలంలో జైలుకు 12 ఎకరాలు, వైకుంఠధామానికి 4 ఎకరాలు కేటాయించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా భూదాన్ భూముల్లో నుంచి ఓ పైవేట్ విల్లాకు 30ఫీట్ల గ్రావెల్ రోడ్డు వేశారు. ట్రస్ట్ భూమిని ఆక్రమించి రోడ్డు వేస్తే అడ్డుకోవాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
ఈ విషయమై కలెక్టర్‌కు పలువురు సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రైతులు వెళ్లేందుకు ఎడ్ల బండిబాట ఉందంట.. అదే రోడ్డు తప్ప వేరే ఏమీ లేదంటూ వారికి ఆయన సమాధానం ఇచ్చినట్లు వారు తెలిపారు. ఇక ఈ భూమికి పూర్వాపరాలేంటి.. దీన్ని కాపాడాల్సిన అవసరం ఏంటనేది ఒకసారి పరిశీలిస్తే..
2017నుంచే కబ్జాకు యత్నం..అప్పుడున్న అధికారుల తేల్చింది ఏంటి.. ?
2017వ సంవత్సరం నుంచి ఈ భూదాన్ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ భూముల వెనకాల ఉన్న ఓ పైవేట్ విల్లాకు వెళ్లేందుకు భూదాన్ భూమిలో నుంచి రోడ్డు వేశారు. అప్పటికే అక్కడున్న ఇది ప్రభుత్వ భూమి అని తెలిపే బోర్డును తీసేసి, భూమి చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి మరి విల్లాలకు రోడ్డు తిశారు. అప్పట్లో దీనిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. కాగా దీనిపై కొందరు అమాయక రైతులతో కోర్టులో కేసు వేయించారు. 20 ఏళ్లుగా వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఈ భూమిలోని రోడ్డును వాడుకుంటున్నామని పిటిషన్ వేయించారు.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ పిటిషన్లో 10 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉన్నట్లు పిటిషనర్లు స్పష్టంగా పేర్కొన్నారు. కాగా దీనిపై కోర్టు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు. కేసు వేసిన పిటిషనర్లను పిలిపించి, స్థానికుల సమక్షంలో గ్రామ నక్షాను అనుసరించి సర్వే చేసింది. ఈ సర్వేలో ఇక్కడ ఎలాంటి రోడ్డు లేదంటూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ తేల్చిచెప్పారు.
దీంతో అప్పుడున్న తహసీల్దార్ రామచంద్రయ్య హైకోర్టులో కౌంటర్ ఫైల్ చేశారు. “రైతులు చెబుతున్న సర్వే నెంబర్ 716, 717, 719 భూములు వ్యవసాయ భూమలు, 772 సర్వే నంబర్లో ఉంది వ్యవసాయేతర భూమి. ఈ భూములను ఓ కమర్షియల్ విల్లాల కోసం ఉపయోగిస్తున్నారు. ఆ విల్లాలకు వెళ్లడానికి సర్వే నంబర్ 707, 708 భూదాన్ భూముల్లో నుంచి రోడ్డు ఉందని బ్రోచర్లు వేశారు. వాస్తవానికి అక్కడ ఎలాంటి రోడ్డు లేదు’ అని కోర్టులో కౌంటర్ వేశారు.
కలెక్టర్ భారతీ హోలికేరి పోరాటం..
విషయం కోర్టులో ఉండగానే ఆ రియల్టర్లు రైతుల పేరు చెప్పి రోడ్డును పున: ప్రారంభించారు. దీంతో అప్పుడున్న కలెక్టర్ భారతీ హోలికేరి అది భూదాన్ భూమి అని దాని చుట్టూ కంచె ఏర్పాటు చేయించారు. దీంతో ఆ రియల్టర్లు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్న కోర్డు ఆదేశాలను ధిక్కరించారంటూ కలెక్టర్‌పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేశారు. దీంతో హైకోర్టు జిల్లా కలెక్టర్‌పై చర్యలను ఆదేశించింది.
ఈ క్రమంలో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ కంటెంట్ ఆఫ్ కోర్టు కేసుపై అప్పీల్‌కు వెళ్లారు. భూదాన్ ట్రస్ట్ భూమిలో రోడ్డు లేదని తగిన సాక్షాధారాలన్నీ సమర్పించారు. దీంతో హై కోర్టు కలెక్టర్‌తో ఏకీభవిస్తూ భూదాన్ ట్రస్ట్ భూములకు సంబంధించిన అన్ని కేసులను కొట్టివేసింది. రోడ్డుకు సంబంధించిన సివిల్ డిస్ప్యూట్స్ అన్నింటిని లోకల్ సివిల్ కోర్టులో తేల్చుకోవాలని ఆదేశించింది.
ఈ విషయం ఇలా ఉండగానే కలెక్టర్ మారడంతో అక్రమార్కులు మరోసారి వేసిన కంచెను తొలగించి రోడ్డు వేశారు. దీనిపై అప్పుడున్న కలెక్టర్ బాదావత్ సంతోష్‌కు ఫిర్యాదు వెళ్లడంతో ఆయన కూడా రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో మరోసారి 2024 ఫిబ్రవరి, మార్చి నెలలలో మధ్యలో మారోసారి కంచె వేయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఈ ఇద్దరు కలెక్టర్లు భూదాన్ భూమి కబ్జా కాకుండా కంచెలు వేయించారు.
ఎన్నికల హడావుడిలో పని కానిచ్చేశారు..
ఇక మొన్న జరిగిన ఎంపీ ఎన్నిలకు ముందు కలెక్టర్ సంతోష్ వేయించిన కంచెను సైతం మరోసారి తొలగించి రియల్టర్లు, ఈ సారి సొంత ఖర్చులతో పటిష్టమైన గ్రావెల్ రోడ్డు వేశారు. దీనిపై ఇప్పుడున్న కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన లేదని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. గతంలో ఉన్న కలెక్టర్లు భారతి హోలికేరి, బదావత్ సంతోష్‌కు కనిపించిన భూదాన్ భూముల కబ్జా ఇప్పుడున్న కలెక్టర్‌కు ఎందుకు కనిపించడం లేదంటూ వాపోతున్నారు.
గతంలో ఉన్న కలెక్టర్లు తప్పు చేశారా.. లేకపోతే ఇప్పుడున్న అధికారులు ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదా అనేది అర్థం కావడం లేదంటున్నారు. ఏ మతలాబు లేకుండా ఎందుకు మిన్నకుండిపోతారు.. పెద్ద మొత్తంలో ఆమ్యాయ్యాలు తీసుకొని అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ కలెక్టర్ చెబుతున్నట్లు అది పొలాలకు వెళ్లే ఎడ్లబండి బాటైతే.. ఆ రోడ్డు 10ఫీట్లు ఉందని ఫిటిషనర్లే కోర్టుకు చెప్పారు.
మరి అలాంటప్పుడు 10ఫీట్లు ఉన్న ఆ మట్టి రోడ్డు ఇప్పుడు 30 ఫీట్లు గ్రావెల్ రోడ్డుగా ఎలా మారింది… కబ్జా కాకుండానే రోడ్డు సైజ్ పెరిగిందా.. ఇకపోతే అది భూదాన్ భూమి అని తెలిసినా ఆ రోడ్డు పక్కన విద్యుత్‌శాఖ అధికారులు ఏం చూసి కరెంట్ పోల్స్ వేసి, ఎక్కడికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. రైతులకు దానితో వచ్చే ప్రయోజనం ఏంటి. అసలు ఆ రోడ్డు ఆవల ఎన్ని ఎకరాలు సాగవుతుంది. అసలు ఇంతా దర్జాగా ప్రభుత్వ భూమిని కొట్టేయడం వెనక ఉన్న ఆ పెద్ద‘హస్తం’ ఎవరిది అనేది ఇప్పటికైనా అధికారులు తేల్చాల్సి ఉంది.
బీటీ రోడ్డు వేసేందుకు డీఎంఎఫ్టీ ఫండ్స్..
ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. భూదాన్ ట్రస్టు భూములను కబ్జా చేసి విల్లాలకు వెళ్లేందుకు వేసిన రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ హయాంలో డీఎంఎఫ్టీ ఫండ్స్ రూ.30 లక్షలు కేటాయించారు. కాగా ఎమ్మెల్యే పీఎస్ఆర్కు అది భూదాన్ భూమి రోడ్డు అని తెలియక రోడ్డు ప్రపోజ్ చేశారా..! లేక తెలిసే ప్రపోజ్ చేశారా అన్న విషయం స్పష్టత లేకుండా పోయింది.
కాకపోతే డీఎంఎఫ్టీ నిధులతో బీటీ రోడ్డు వేసేందుకు అనుమతులు వచ్చిన మరుసటి నెలనే జూలై 22న ఆ పనులను క్యాన్సిల్ చేస్తూ మాడిఫికేషన్ ప్రొసిడింగ్ ఇచ్చారు. భూదాన్ భూమిలో బీటీ రోడ్డు వేసేందుకు ముందు ఎందుకు అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత ఎందుకు క్యాన్సిల్ చేశారు అన్నది తేలాల్సి ఉంది. ప్రభుత్వ భూములను రక్షించే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పీఎస్ఆర్ భూదాన్ భూమిని రక్షించడంలోనే అంతే కఠినంగా వ్యవహరిస్తారా లేదా అన్నది ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది. ప్రభుత్వ భూములను రక్షించే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
మున్సిపాలిటీ ఎలా అనుమతిచ్చింది..
దీనిపై రోడ్డు నేరుగా వెళ్తున్న హరినిలయ విల్లాల నిర్వహకులను వివరణ కోరగా.. ఇది 8 సంవత్సరాల క్రితం విషయం అన్నారు. ప్రభుత్వ భూమిలో నుంచి రోడ్డు వేసి మీ విల్లా రోడ్డుగా ఎలా చూపిస్తారని ప్రశ్నించగా.. వెంచర్‌కు అనుమతి తీసుకునేప్పుడు మున్సిపాలిటీ వారే మాకు ఆ రోడ్డును చూసి అనుమతులు ఇచ్చారని తెలిపారు. మున్సిపాలిటీ వారు అలా ఎలా అనుమతులు ఇచ్చారు. అసలు అది ఎలా సాధ్యమైందన్నది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది.