రెబ్బెన, ఆగస్టు 17 : మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం(పీఏసీఎస్)లో జరిగిన అక్రమాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాలు తీసుకోకున్నా తీసుకున్నట్లు, రుణాలు మాఫీ అయినా.. కానట్లు, చనిపోయిన వారికి సైతం రెన్యువల్ అయినట్లు రికార్డుల్లో ఉండడంతో ఆందోళనకు దిగారు. పీఏసీఎస్ అధికారుల నిర్వాకం వల్ల తాము నష్టపోయామంటూ శుక్రవారం రాత్రి పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకొని సీఈవో సంతోష్‌ను నిలదీశారు.
ఎంతకూ స్పందించకపోగా, మాజీ జడ్పీటీసీ జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు సమచారం అందించారు. అసిస్టెంట్ రిజిస్టర్ అనంతలక్ష్మి కార్యాలయానికి చేరుకొని విచారణ చేపట్టగా, రికార్డులు కనిపించలేదు. కంప్యూటర్ పని చేయలేదు. దీంతో శనివారం పూర్తి విచారణ చేపడుతామని హామీ ఇవ్వడంతో రైతులు, నాయకులు వెళ్లిపోయారు.
శనివారం ఉద యం జిల్లా సహకారం సంఘం ఆడిట్ అధికారి రబ్బానీ, సొసైటీ ఆడిటర్ కావేరి, సీనియర్ ఇన్స్పెక్టర్ వెంకటరమణల బృందం కార్యాలయానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. రైతులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు అక్కడికి చేరుకొని అధికారులను నిలదీశారు. అక్కడి నుంచి రైతువేదిక వద్దకు చేరుకోగా, తాళాలు వేసి ఉండడంతో పగులగొట్టారు. ఆపై అధికారులు సమావేశం నిర్వహించగా, వారితో రైతులు, నాయకులు వాగ్వాదానికి దిగారు. అనంతరం పీఏసీఎస్‌లో 374 మంది ఖాతాలు కలిగిన జాబితా తెప్పించి.. అందరి సమక్షంలో లిస్టు చదివి వినిపించగా.. అందులో అవకతవకలను చూసి అవాక్కయ్యారు.
తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేయగా, అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మండిపడ్డారు. రైతులు, వివిధ పార్టీల నాయకులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్దకు చేరుకొని అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రెబ్బెన తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడికి చేరుకొని రైతులు, వివిధ పార్టీల నాయకులను సముదాయించినా వారు వినిపించుకోలేదు.
కలెక్టర్ రావాల్సిందేనని పట్టుబట్టారు. ఆపై అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ రామ్మోహన్‌రావుకు వినతిపత్రం అందించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేశ్ సైతం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లావు డ్య రమేశ్, మాజీ జడ్పీటీసీలు సంతోశ్, దుర్గం సోమయ్య, మాజీ సర్పంచ్ చెన్న సోమశేఖర్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గం దేవాజీ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, బీజేపీ నియోజక వర్గ ఇన్చార్జి లక్ష్మి, జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, నాయకులు చిరంజీవిగౌడ్, శ్రీనివాసగౌడ్, ఇమ్రో జ్, అన్నాజీ, ఆనంద్, నవీన్‌గౌడ్ ఉన్నారు.