చెన్నూర్, నవంబర్ 23 : చెన్నూర్ పట్టణంలో నిత్యం ఏదో ఒక వార్డులో ప్రజలు నీటి సమస్యను ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. తలాపునే గోదావరి నది ప్రవహిస్తున్నా శాశ్వత పరిష్కారం చూపే నాథుడు లేక అవస్థలు పడాల్సి వస్తున్నది. ఇక నీటి తిప్పలు తీర్చాల్సిన యంత్రాంగం అత్యుత్సాహం ప్రదరిస్తూ బోర్లకు తాళాలు వేస్తుండగా, స్థానికుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
పెరిగిన జనాభా.. పట్టని యంత్రాంగం
చెన్నూర్ పట్టణ ప్రజలకు తాగు నీరందించేందుకుగాను 50 ఏళ్ల క్రితం అప్పటి సర్కారు నల్లాలు ఏర్పాటు చేసింది. అప్పటి నివాస గృహాలు, ప్రజల అవసరాలను బట్టి పట్టణ సమీపంలోని బతుకమ్మ వాగులో సంప్.. ప్రభుత్వ దవాఖాన సమీపంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించింది. వార్డులతో పాటు అవసరమున్న ఇళ్లకు నల్లా కలెక్షన్లు ఇచ్చింది. అప్పట్లో నల్లాల ద్వారా రెండు పూటలు సరిపడా నీరు సరఫరా జరిగేది. క్రమేనా పట్టణ విస్తీర్ణం పెరిగింది. పట్టణ జనాభా పెరగగా, వేల సంఖ్యలో గృహాలు నిర్మాణమయ్యాయి. అందుకనుగుణంగా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయకపోవడంతో నిత్యం నీటికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. పట్టణంలోని పలు వార్డుల్లో అధికారులు బోరు బావులు ఏర్పాటు చేయగా, ప్రజలు తమ నీటి అవసరాలను తీర్చుకునేవారు. ఆపై ఆ బోరు బావులకు విద్యుత్ మోటర్లను అమర్చి.. ఇంటింటికీ పైపులైన్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం ఆ నీటినే వాడుకుంటున్నారు.
అధికారుల అత్యుత్సాహం..
చెన్నూర్ పట్టణంలోని దాదాపు 80 శాతం మంది బోరు బావుల మీదే ఆధారపడుతున్నారు. ఈ బోరు బావులకు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటర్లకు సంబంధించిన స్టార్టర్ల బాక్సులకు ఈ నెల 4న మున్సిపాలిటీ అధికారులు తాళాలు వేశారు. దీంతో నీటి సరఫరా నిలిచి పలు వార్డుల్లో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికారులు తాళాలను తీశారు. ఆ తర్వాత వార్డుల్లో ఎప్పటిలాగే నీరు సరఫరా జరుగుతున్నది. అయితే, రజక వాడలోని బోరు బావి విద్యుత్ మోటర్ స్టార్టర్ బాక్సుకు శుక్రవారం మున్సిపాలిటీ సిబ్బంది మరోసారి తాళాలు వేయడంతో మహిళలు మున్సిపాలిటీ కార్యాలయ ముందు ధర్నా చేపట్టారు. దీంతో అధికారులు తాళాలు తీశారు. తిరిగి శనివారం ఉదయం మరోసారి తాళాలు వేయడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఖాళీ బిందెలతో మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేశారు. మున్సిపాలిటీ అధికారుల అత్యుత్సాహం వల్లే నీటి సమస్య తలెత్తుతుందని మహిళలు మండిపడ్డారు.
తాగునీటికీ తప్పని తిప్పలు
బోరు బావుల నీరు తాగు నీటికి పనికి రాకపోగ.. ఇంటి అవసరాలకే వాడుకుంటున్నారు. తాగు నీటికి మాత్రం నిత్యం తిప్పలు పడుతున్నారు. ఆర్థికంగా ఉన్నవారు మినరల్ వాటర్ కొనుక్కుంటుండగా.. మిగతా వారు ప్రభుత్వ దవాఖాన సమీపంలోని ఓవర్ హెడ్ వ్యాటర్ ట్యాంకు వద్దకు వెళ్లి బిందెల్లో తాగు నీరు తెచ్చుకుంటున్నారు.
మరమ్మతులు లేక అందని భగీరథ నీరు
కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ పథకం ద్వారా పైపులైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికీ నల్లా నీరు అందించారు. కొన్ని రోజుల పాటు ఇంటింటికీ రెండు పూటలా నీరు సరఫరా చేశారు. క్రమేనా సర్కారు మారడం.. చిన్న చిన్న రిపేర్లను అధికారులు పట్టించుకోకపోవడంతో తాగు నీరు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణను సంప్రదించగా అందుబాటులో లేరు.
రెండో రోజూ మహిళల ధర్నా
చెన్నూర్, నవంబర్ 22 : పట్టణంలోని రజకవాడలోగల బోరు బావి విద్యుత్ మోటర్ స్టార్టర్కు సంబంధించిన బాక్స్‌కు మున్సిపాలిటీ సిబ్బంది తాళం వేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రెండో రోజూ స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తాళం వేసి గోస పెడుతున్నరు
మా వార్డులో ఉన్న బోరు బావి మోటర్ స్టార్టర్ బాక్స్‌కు మున్సిపాలిటీ అధికారులు తాళం వేయడం వల్ల మస్తు తిప్పలైతంది. ఇది వరకు బోరు బావి పాడైపోవడంతో 15 రోజులు నరకం చూసినం. ఈ మధ్యే దానిని మంచిగ చేయించారు. ఏందుకో ఏమో.. నిత్యం దానికి తాళం వేస్తున్నారు. గీ బోరు బావిపై 20 కుటుంబాలు ఆధారపడ్డాయి. సార్లు నీటి సమస్యను పరిష్కరించాల్సింది పోయి గిట్లా గోస పెడుతున్నరు. ఇకనైనా మా బాధ పట్టించుకోవాలె. – జయ్యారపు రమా, రజకవాడ, చెన్నూర్
మస్తు తిప్పలైతంది..
బోరు బావే మాకు దిక్కు. దానికి తాళం వేయడం ఏమిటో అర్థం కావడం లేదు. మస్తు తిప్పలైతంది. మా ఇబ్బందులు చూసి కూడా అలా చేయడం సరికాదు. గందుకే మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ధర్నా చేస్తున్నం. అంతకుముందు మిషన్ భగీరథ నీళ్లచ్చేవి. దానిని మంచిగ చేసేటోళ్లు లేరు. ఇకనైనా సార్లు స్పందించి మా గోస తీర్చాలే.
– పున్న రమా, రజకవాడ, చెన్నూర్