తాండూర్ : అంగన్వాడీ టీచర్లు (Anganwadi Teachers ) తమ విధినిర్వహణను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని జిల్లా సంక్షేమాధికారి రవూఫ్ఖాన్ (Raofkhan) అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కిష్టంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన పోషన్ బీ – పడాయి బీ పై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారంతో ముగిసాయి. ఈ కార్యక్రమానికి సీడీపీవో స్వరూపారాణితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు. చిన్నారులకు సరైన పోషణతో పాటు సరైన విద్యాబోధన చేస్తే శారీరకంగా, మానసికంగా ఎదుగుతారన్నారు.
తక్కువ ఖర్చుతో ఆటవస్తులను తయారు చేసి వాటి ద్వారా విద్యా బోధన చేస్తే పిల్లలు త్వరగా నేర్చుకోగలుగుతారన్నారు. అంగన్వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలపై దృష్టి సారించాలని సూచించారు. మహిళా సాధికారత హబ్ జెండర్ స్పెషలిస్ట్ విజయ, పైనాస్ లిటరసీ లిప్సిక అంగన్వాడీలకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. భేటీ బచావో- భేటీ పడావో పథకం, బాల్యవివాహాల నిరోధక చట్టం, ఆన్లైన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, మహిళ హెల్ప్ లైన్ 1980, సఖి సర్వీసెస్, హెల్ప్ లైన్ నెంబర్ 181, చైల్డ్ హెల్ప్ లైన్, నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ 112, సుకన్య సమృదియోజనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రమాదేవి, స్వరూప, పుష్ప పాల్గొన్నారు.