కరెంట్ బిల్లు రీడింగ్, బిల్లింగ్ ప్రక్రియ ఇక సులభమైంది. సాంకేతికతను వినియోగించుకుంటూ వేగంగా సేవలందించేందుకు ఎన్పీడీసీఎల్ స్మార్ట్‌గా ముందుకెళ్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ యాప్‌ను తయారు చేసి యూఎస్బీ డివైజ్ ఆధారంగా స్మార్ట్ ఫోన్‌తో మీటర్‌ను స్కాన్ చేసేలా రూపొందించింది. దీని వల్ల సెకన్లలో రీడింగ్ వివరాలతో బిల్లు చేతికి రావడమే కాకుండా ఆ వివరాలు కార్యాలయానికి చేరుతాయి. ఇప్పటికే పట్టణాల్లో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుండగా.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రారంభమైంది.
– దస్తురాబాద్ / భైంసా, జనవరి 8
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికత వైపు విద్యుత్ శాఖ అడుగులు వేస్తున్నది. ఆన్లైన్ పేమెంట్ యాప్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అదే ఫోన్ ద్వారా మీటర్‌ను స్కాన్ చేయడం ద్వారా విద్యుత్ రీడింగ్ తీసే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సులవుగా సేవలందించేందుకు టీఎస్ ఎన్పీడీసీఎల్ ఈ టెక్నాలజీని వినియోగించుకుంటున్నది. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ సహాయంతో సులువుగా కరెంట్ మీటర్ రీడింగ్ తీసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పలు చోట్ల, పట్టణాల్లో దీనిని విజయవంతంగా అమలు చేస్తుండగా, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ డిసెంబర్ నెల నుంచి ఈ పద్ధతిని ప్రారంభించింది.
గతంలో ఇంటింటికీ విద్యుత్ సిబ్బంది తిరిగి మీటర్ రీడింగ్ పుస్తకంలో రాసుకొని వారం తర్వాత వినియోగదారుడికి బిల్లు ఇచ్చే వారు. ఈ విధానంతో వినియోగదారులు, సంస్థకు ప్రయోజనకరంగా లేకపోవడంతో స్పాట్ బిల్లింగ్ యంత్రాలను ప్రవేశ పెట్టింది. ఇంటి వద్దే బిల్లు తీసి ఇచ్చేవారు. యంత్రంలో బిల్లు నమోదైన అనంతరం దాన్ని కంప్యూటర్‌కు అనుసంధానించి సర్వర్‌లో అప్లోడ్ చేసేవారు. దీనికి రెండు, మూడు రోజుల సమయం పట్టేది. అప్లోడ్ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని సర్వీస్‌లకు సంబంధించిన బిల్లుల హెచ్చుతగ్గులుగా నమోదు కావడం, ఇతర సమస్యలు ఏర్పడేవి. యంత్రాలు మరమ్మతులకు గురైతే రోజుల తరబడి సిబ్బంది రీడింగ్ తీసేందుకు రాని పరిస్థితి ఉండేది.
మొబైల్ యాప్ టీఎస్ ఎన్‌పీడీఎస్‌ఎల్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. దీంతో బిల్లు తీసిన వెంటనే వినియోగదారుడి మీటర్ రీడింగ్, బిల్లు వివరాలు కార్యాలయానికి చేరుతాయి. వినియోగదారుడు ఎన్ని యూనిట్ల కరెంట్ వినియోగించాడు? ఎంత బిల్లు పెండింగ్‌లో ఉంది? యూనిట్ కు ఎంత ధర? ఎప్పటివరకు బిల్లు చెల్లించాలి? అనే పూర్తి వివరాలతో ప్రింటర్ ద్వారా బిల్లు వెంటనే వస్తుంది. ఈ వి ధానంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది వినియోగదారుల కరెంట్ బిల్లు తీసేందుకు అవకాశం ఏర్పడింది. స్మార్ట్ ఫోన్లో తీసిన ప్రతి వినియోగదారుడు పేరుతో పాటు కరెంట్ వినియోగించిన యూనిట్లు, బిల్లు తీసిన తేదీ, సమ యం, బిల్ నంబర్, ఎప్పటి వరకు ఎంత చెల్లించాలి? వచ్చే సబ్సిడీ ఎంత? విద్యుత్ అధికారుల మొబైల్ నంబర్లతో సహా పూర్తి వివరాలు తక్షణం అందులో నమోదవుతున్నాయి.
ఇంతకుముందు కాంట్రాక్ట్ ఉద్యోగులతో కరెంట్ బిల్లు తీయడం వల్ల వినియోగదారుడు వాడిన కరెంట్‌కు, బిల్లుకు కొన్నిసార్లు తేడాలుండేవి. వినియోదారుడు వాడిన యూనిట్ల వివరాలు సరిగా లేకపోవడంతో బిల్లు ఎక్కువ వచ్చిందని కస్టమర్లు అధికారులకు అడిగినా, వారు సరైన సమాధానం చెప్పలేక ఇబ్బంది పడాల్సి వచ్చేది. 20 రోజలతో పాటు కరెంట్ బిల్లులు తీసిన మిషన్ అప్పగిస్తే 10 రోజులతో పాటు ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేసేవారు. ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చు. వినియోగదారుడు వాడిన కరెంట్‌ను ఎలాంటి అవకతవకలు లేకుండా బిల్లు ఇవ్వవచ్చు. ఎంత కరెంట్ కాల్చితే అంతే బిల్లు పడుతుంది. సలువుగా వినియోగదారుడి వివరాలు కార్యాలయానికి చేరుతాయి. కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎప్పటికప్పుడు మొబైల్ యాప్‌తో వివరాలు నమోదవుతాయి. దీంతో ఏ రోజు ఎన్ని బిల్లులు తీశారో వెంటనే తెలిసిపోతుంది. వినియోదారుడికి చెప్పాల్సిన అవసరం లేకుండా పూర్తి వివరాలు క్షణాల్లో వస్తాయి. ఈ విధానం సౌకర్యవంతంగా ఉండడంతో పాటు వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందుబాటులోకి వస్తుండడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొబైల్ యాప్ ద్వారా బిల్లులు తీసే పద్ధతిని మండలంలో డిసెంబర్లో ప్రారంభించాం. ఇక నుంచి ప్రతి నెలా ఈ యాప్ ద్వారానే బిల్లు తీస్తాం. తక్కువ సమయంలో ఎక్కువ బిల్లులు తీయవచ్చు. పని మరింత సులువుగా చేయగలుగుతున్నాం. ఈ యాప్‌తో అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు వినియోగదారుడు వాడిన కరెంట్‌కు బిల్లు వస్తుంది. స్మార్ట్ ఫోన్లో తీసిన ప్రతి బిల్లు వివరాలు ప్రింట్లో వస్తాయి. ఈ విధానం సౌకర్యవంతంగా ఉండడంతో పాటు వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందుబాటులోకి వస్తాయి. అవకతవకలకు ఆస్కారం ఉండదు.
– కేశెట్టి శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏఈ, దస్తురాబాద్