కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : జిల్లా యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా నకలీ పత్తి విత్తనాల దందా ఆగడం లేదు. గతంలో మహారాష్ట్ర నుంచి ఎక్కువగా సరఫరా చేసిన వ్యాపారులు, ఈ మధ్య ఆం ధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకుంటూ దందా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల పెంచికల్పేట్లో పట్టుబ డ్డ పత్తి విత్తనాలు ఆంధ్రా ప్రాంతం నుంచే వచ్చినట్లుగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గుర్తించడం ఇందుకు బలం చేకూరుస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి పెద్ద ఎత్తున వివిధ మార్గాల నుంచి నకిలీ విత్తనాలు వస్తున్నాయి. వానకాలం సీజన్ ప్రారంభం కావడానికి దందా జోరుగా సాగుతున్నది. గోనే సంచుల్లో నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి చేరవేసి అమాయక రైతులకు అంటగడుతున్నారు. నకిలీ విత్తనాలు గుర్తించేలా ఉండకపోవడంతో రైతులు వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. సాధారణంగా బ్రాండెడ్ కంపెనీలు విక్రయించే విత్తనాలు, మందులపై వాటిని తయారు చేసిన తేదీ, ఎక్స్పైరీ తేదీ, లాట్ నంబర్లు తదితర వివరాలు ఉంటాయి. బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసినట్లుగా నకిలీ విత్తనాల కంపెనీలు కూడా అదేస్థాయిలో ప్యాకెట్లను ముద్రించి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. కానీ, వీటిపై విత్తనాలు తయారు చేసిన తేదీ.. ఎక్స్పైరీ తేదీ.. లాట్ నంబర్ వంటి వివరాలు ఉండవు. ఏదో ఒక పేరుతో ప్యాకెట్లను తయారు చేసి సరఫరా చేస్తుంటారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఎరువులు, విత్తనాలు అమ్మేందుకు లైనెస్స్లు పొందిన డీలర్లు 251 మంది ఉన్నారు. వీరంతా తమ దుకాణాల ద్వారానే విత్తనాలు, ఎరువులు అమ్ముతున్నారు. నకిలీ విత్తనాలను లైసెన్స్ పొందిన వారే తెప్పిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫర్టిలైజర్స్‌ను తనిఖీ చేస్తున్నారు. నిషేధిత విత్తనాలు, ైగ్లెసిల్లను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు పొరుగున్న ఉన్న రాష్ర్టాల నుంచి సరఫరా అయ్యే నకిలీ విత్తనాలపై నిఘా పెడుతున్నారు. గతంలో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తూ పట్టుబడిన వారిపై కూడా దృష్టి సారిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్ జిల్లాలోనికి ప్రవేశించే రహదారుల వద్ద చెక్‌పోస్టులు పెట్టారు. వాంకిడి బార్డర్ వద్ద చెక్‌పోస్టుతోపాటు సిర్పూర్-టీలోని వెంకట్రావ్‌పేట్, హుడ్కిలి, చింతలమానేపల్లిలోని గూడెం వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అటు ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చే నకిలీ పత్తి విత్తనాలను కూడా అడ్డుకునేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు ఇటీవల పలుచోట్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. నెల క్రితం చింతలమానేపల్లిలో రూ. 10.50 లక్షల విలువ చేసే 3 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. అలాగే ఈ నెల 7న పెంచికల్పేట్ రూ. 12 లక్షల విలువైన 4 క్వింటాళ్లను స్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఊష సుబ్బారావుతో పాటు భీమిని మండలం సోమగూడెంకు చెందిన రాచకొండ నగేశ్, సోమగూడెంకు చెందిన ఇనుముల రవితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన పలమరి సురేషన్ ఉండడం విశేషం.