ఆదిలాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సాగు ఆశాజనకంగా ఉన్నా ఎరువుల కొరత వేధిస్తున్నది. ఈ సీజన్లో 5.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో పత్తి 4.4 లక్షల ఎకరాల్లో సాగైంది. వానకాలం సాగు కోసం 92 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల వినియోగం అవుతుందని అంచనా వేశారు. వీటిలో యూరియా 35 వేలు, కాంప్లెక్స్ ఎరువులు 36 వేలు, డీఏపీ 13 వేలు, ఎంవోపీ 7 వేలు, ఎస్ఎస్పీ 4 వేల మెట్రిక్ టన్నుల వినియోగం అవుతాయని గుర్తించారు. ఏప్రిల్ నుంచి ఎరువుల పంపిణీ ప్రారంభించారు. ప్రస్తుతం పత్తి పంటకు రైతులు డీఏపీని అధికంగా వినియోగిస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు దుకాణాలకు డీఏపీ సరఫరా కావడం లేదని జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వ్యాపారులు తెలిపారు. దీంతో దుకాణాదారులు రైతులకు ప్రత్యామ్నాయ ఎరువులను విక్రయిస్తున్నారు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో 20-20-0-13 ఎరువులను కొనుగోలు చేస్తున్నారు.
ఈ ఏడాది వానకాలం సీజన్ రైతులకు అనుకూలంగా ఉంది. జూన్ మొదటి వారంలో వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తాయి. పంటలకు అవసరమైన సమయంలో వర్షాలు పడుతుండడంతో పత్తి, సోయా, మక్క పంట ఎదుగుదల బాగా ఉంది. రైతులు పంటలు పెరగడానికి ఎరువులను వినియోగిస్తారు. ఈ సమయంలో జిల్లాలో ఎరువుల కొరత రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నది. గ్రామాల్లో ప్రాథమిక సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, పట్టణాల్లో ప్రైవేటు డీలర్లు ఎరువులను విక్రయిస్తారు. రైతులకు అవసరమైన ఎరువులు దుకాణాల్లో లభించకపోవడంతో పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకున్నది. కొందరు వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల భీంపూర్ మండలంలోని అందర్బంద్ వద్ద 222 బస్తాలతో ఉన్న యూరియా లారీని టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. కొందరు వ్యాపారులు రైతుల పేరిట ఎరువులను మహారాష్ట్రకు తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు తమకు సరిపడా ఎరువులను పంపిణీ చేసి పంటలు నష్టపోకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.