మంచిర్యాల అర్బన్, నవంబర్ 2 : విద్యార్థులకు విజ్ఞానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా ఆవిష్కరణలు చేసి, ప్రదర్శనలు నిర్వహిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిర్వహించని కార్యక్రమాల్లో ‘బాలల సైన్స్ కాంగ్రెస్’ ఒకటి. రెండేండ్లుగా నిలిచిపోయిన ఈ కార్యక్రమాన్ని, ఈ ఏడాది విద్యార్థుల ప్రాజెక్టులతో నిర్వహించేందుకు సర్కారు సన్నద్ధమైంది. విద్యార్థులను బావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ నెల చివరి వారంలో జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో పాఠశాలలు దరఖాస్తు చేయించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. అందుకోసం 3వ తేదీన జూమ్ మీటింగ్ ద్వారా ఎంఈవోలు, హెచ్ఎంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నది.
9 అంశాలు.. 100 మార్కులు..
జిల్లా స్థాయిలో 9 అంశాలకు 100 మార్కులు ఇవ్వనున్నారు. సరికొత్త ఆలోచన, భావన అంశానికి 10 మార్కులు, ఎంచుకొన్న అంశం ప్రధానాంశానికి సరిపోతే 10 మార్కులు, సమస్య గురించి అవగాహనపై 15 మార్కులు, దత్తాంశ సేకరణ- విశ్లేషణకు 15 మార్కులు, ప్రయోగాలు-నిర్ధారణకు 10 మార్కులు, సమస్య పరిష్కారం కోసం కృషికి 10 మార్కులు, జట్టు పని-సమన్వయానికి 10 మార్కులు, విద్యార్థి నేపథ్యానికి 10 మార్కులు, వ్యక్తీకరణకు 10 మార్కులు ఇలా.. మొత్తం 100 మార్కులు కేటాయించారు.
ఆరోగ్యం, సంక్షేమమే ప్రధానాంశంగా…
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు, విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు 1993 నుంచి జాతీయ శాస్త్ర సాంకేతిక సమాచార మండలి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ‘ఆరోగ్యం, సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం’ అనే అంశాన్ని ప్రధానాంశంగా నిర్ణయించారు.
ఉప అంశాలు..
విద్యార్థులను సన్నద్ధం చేయాలి..
జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్కు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ఆయా మండలాల ఎంఈవోలు, పాఠశాలల హెచ్ఎంలు సన్నద్ధం చేయాలి. విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరింత అవగాహన కల్పించేందుకు అన్ని పాఠశాలల హెచ్ఎంలు, సైన్స్ టీచర్లతో 3వ తేదీన ఉదయం 10 గంటలకు జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేందుకు అవసరమైన సూచనలు చేయనున్నాం. ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి మధుబాబు(98495 50200), ఎన్సీఎస్సీ అకాడమిక్ కో-ఆర్డినేటర్ మూర్తి (97015 73638)ని సంప్రదించవచ్చు.
– వెంకటేశ్వర్లు, డీఈవో, మంచిర్యాల జిల్లా