సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 12 : నస్పూర్‌లోని సర్వే నంబర్ 42లో టీఎన్జీవోలకు కేటాయించిన భూమిలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని, నిర్మాణాలు నిలిపివేయాలని సొసైటీలో ప్లాట్లు పొందిన పలువురు బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నస్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సొసైటీ బాధ్యులు ఇష్టారాజ్యంగా ప్లాట్ నంబర్లు కేటాయిస్తున్నారని, ప్లాట్ల హద్దులు, ఫైనల్ పట్టా సర్టిఫికెట్లలో హద్దులు సరిచూసి వ్యత్యాసముంటే నిర్మాణాలు నిలిపివేయాలని కమిషనర్‌ను కోరారు.
సొసైటీ వారు ఫైనల్ పట్టా సర్టిఫికెట్ల క్రమసంఖ్యను అనుసరించి ప్లాట్లు కేటాయించలేదన్నారు. క్రమసంఖ్యలో ఉన్న 81, 92, 119, 120, 131తో పాటు ముందున్న నంబర్ల వారికి ప్లాట్లు చూపకుండా అవకతవకలకు పాల్పడి, క్రమసంఖ్యలో లేని వారికి ప్లాట్లు కేటాయించారని ఆరోపించారు. ఇప్పటికైనా పారదర్శకంగా విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. స్వచ్ఛంద పౌర సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేపీ సీనియర్ నేత తుల మధుసూదన్‌రావుతో పాటు ఎంఆర్పీఎస్ నాయకుడు ఎస్ఆర్ బోస్, స్వచ్ఛంద పౌర సేవా సంస్థ అధ్యక్షుడు కనుకుంట్ల మల్లయ్య, బల్ల శివశంకర్, సామాజిక కార్యకర్త నయీం మద్దతు ప్రకటించారు.
కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంజీ కుర్షిత్, అహ్మద్‌ఖాన్, పోచయ్య, బషీర్, అహ్మద్‌ఖాన్, రాజయ్య, అఫ్జల్ నబీ, తదితరులు పాల్గొన్నారు.