ఆదిలాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్‌లో రిమ్స్‌లో జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళన రెండో రోజూ శుక్రవారం కొనసాగింది. హాస్టల్లో మెడికోలపై దుండగుల దాడిని నిరసిస్తూ గురువారం ఆందోళన బాట పట్టిన విద్యార్థులు రిమ్స్ డైరెక్టర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండో రోజూ జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించగా, విద్యార్థులు కూడా తరగతులకు హాజరుకాకుండా ఆందోళనలో పాల్గొన్నారు.
కళాశాల ఎదుట బైఠాయించి డైరెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రిమ్స్‌లో విద్యార్థులకు సరైన భద్రత లేకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని జూనియర్ డాక్టర్లు వాపోతున్నారు. విద్యార్థులపై దాడి ఘటనలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్‌ను విధుల నుంచి తొలగించగా వసీం, శివ, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి రిమ్స్‌కు చేరుకొని దాడి ఘటనపై విచారణ జరిపారు. రిమ్స్ ఘటనకు సంబంధించి వైద్యవిద్యా డైరెక్టర్ కే.రమేశ్ రెడ్డి ఇద్దరు సభ్యుల కమిటీని నియమించారు. నిజామాబాద్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలో సైక్రియాట్రిక్ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ శివప్రసాద్, పల్మనాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ వీవీ రావు ఈ కమిటీలో ఉన్నారు.
విద్యార్థులపై దాడికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యుల కమిటీ శుక్రవారం రిమ్స్‌కు చేరుకొని విచారణ చేపట్టింది. డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ వీవీ రావు రిమ్స్‌కు చేరుకొని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఇతర ప్రొఫెసర్లతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. జూనియర్ డాక్టర్లతో కూడా మాట్లాడారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది వద్ద వివరాలు తెలుసుకున్నారు. విచారణ కమిటీ సభ్యులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వీరితో విడివిడిగా మాట్లాడారు. మధ్యాహ్నం తర్వాత కమిటీ సభ్యులు తమ విచారణ పూర్తయిందని ఘటనకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.
అయితే దాడి ఘటనకు సంబంధించి విచారణ సక్రమంగా జరగడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. పూర్తిగా డైరెక్టర్‌కు అనుకూలంగా ఉన్న వారితోనే విచారణ చేయించుకుంటున్నారని మండిపడ్డారు. నివేదిక కూడా వారికి అనుకూలంగా వచ్చే అవకాశమున్నదని చెప్పుకొచ్చారు.
ఎదులాపురం,డిసెంబర్ 15: రిమ్స్ మెడికల్ క్యాంపస్‌లో జరిగిన ఘటనలో ముందుగా డైరెక్టర్‌ను విధుల నుంచి తొలగించాకే విచారణ చేపట్టాలని వైద్యవిద్యార్థులు డిమాండ్ చేశారు. తరగతులు బహిష్కరించిన వైద్య విద్యార్థులు రిమ్స్ మెడికల్ కళాశాల ఎదుట ధర్నా, నిరసన చేపట్టారు. సాయంత్రం రిమ్స్ ప్రధాన గేటు ఎదుట డైరెక్టర్ దిష్టి బొమ్మ దహనం చేశారు.