తాంసి, జూలై 5: విత్తు కొద్ది ఫలం అంటారు పెద్దలు.. రైతులు సాగు చేసే పంటకు నాణ్యమైన విత్తనం ఎంచుకుంటే మంచి దిగుబడి వస్తుంది. నకిలీ విత్తనం విత్తితే శ్రమ వృథా కావడంతో పాటు పెట్టుబడులు నష్టపోతారు. వానకాలం సీజన్ పనులు ప్రారంభం కావడంతో విత్తనాల ఎంపిక, కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
మొలకశాతం పరీక్ష చేసుకోవాలి.
రైతులు ఫెర్టిలైజర్ దుకాణాల్లో కొన్న విత్తనాలను నేరుగా చేనులో విత్తుకోకుండా ముందుగా ఇంటి వద్ద మొలకశాతం పరీక్ష చేసుకోవాలి. ఏ పంట విత్తనాలైనా ప్యాకెట్లోని వంద గింజలను తీసుకొని నాటినట్లయితే మక్క 90 శాతం, పత్తి 65 శాతం, నూనె గింజలు 70 శాతం మొలకలు వచ్చినట్లయితేనే చేనులో విత్తుకోవాలి. తాంసి మండలంలో 17,313 ఎకరాల్లో సాగు భూమి ఉండగా వర్షాధార భూమి 8,062 ఎకరాలు, చెరువులు, బావుల ద్వారా 9,251 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని మండల వ్యవసాయాధికారి రవీందర్ తెలిపారు.
లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే కొనాలి…
ప్రభుత్వం నుంచి అధికారికంగా విత్తన లైసెన్స్‌లు పొందిన డీలర్ల వద్దనే కొనడం వలన రైతులు మోసాల భారి నుంచి తప్పించుకోవచ్చు. విత్తన ప్యాకెట్లు చిరిగిన లేదా తెరిచి ఉన్న తిరస్కరించడమే ఉత్తమం. విత్తన ప్యాకెట్లపై విత్తన రకం. మొలక శాతం, స్వచ్ఛత శాతం, లాట్ నంబర్, అమ్మకం ధర, విత్తన పరీక్ష చేసిన తేదీ వంటి వివరాలు ఉన్నాయో లేదో చూసుకొని కొనుగోలు చేయాలి. లేబుల్ రూపంలో లేకపోతే నకిలీవి గుర్తించాలి. ప్యాకెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే విత్తనానికి సంబంధించిన కంపెనీ, వివరాలు తెలుసుకోవచ్చు.
తక్కువకు వస్తున్నాయని కొనుగోలు చేయవద్దు
లైసెన్స్ దుకాణాల్లో కాక అంగట్లో తక్కువ ధరకు విత్తనాలు విక్రయిస్తే కొనుగోలు చేయవద్దని రైతులకు సూచిస్తున్నారు. అనుమానితులెవరైనా విత్తనాలు విక్రయించినట్లు కనిపిస్తే వ్యవసాయ అధికారులు దృష్టికి తీసుకురావాలని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. వర్షాలు కురవకుండా రైతులు తొందరపడి విత్తనాలు విత్తుకోవద్దని ఏఈవోలు యోగిరాజు, శివప్రసాద్, నిఖిత, వెంకటేశ్ సూచించారు.
అవగాహన కల్పిస్తున్నారు
మాకున్న మూడెకరాల్లో పత్తి పంట వేయాలనుకుంటున్నాం. వ్యవసాయాధికారులు విత్తనాలు కొనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విత్తే ముందు అధికారులు సలహాలు తీసుకుంటాం. వారు అందుబాటులో ఉంటూ సూచనలు ఇస్తున్నారు. నీరు పుష్కలంగా ఉండడంతో సంవత్సరంలో రెండు పంటలు పండిస్తున్నా.
– సిరిగిరి విశ్వనాథ్, యువతరైతు, పొన్నారి
అధికారులు సూచనలు పాటిస్తాం
గతేడాది ఐదెకరాల్లో పత్తి పంట వేస్తే మంచిగా దిగుబడి వచ్చింది. వ్యవసాయ అధికారులు విత్తనాలు ఎలా విత్తుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు రైతులకు ఏఈవో యోగిరాజ్ అందుబాటులో ఉంటూ సూచనలు ఇస్తున్నారు. అధికారులు చెప్పినట్టే సూచనలు పాటిస్తున్నాం. మా క్లస్టర్ పరిధిలో వ్యవసాయ అధికారుల పనితీరు బాగుంది. – మలపతి గంగన్న, ఆదర్శ రైతు, పొన్నారి
బహుమతులకు మోసపోవద్దు
విత్తనాలు కొంటే బహుమతులు ఇస్తామంటూ ఊర్లలో తిరుగుతూ విక్రయించే నకిలీ వ్యాపారుల వద్ద కొనవద్దు. రహస్యంగా విత్తనాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.
–లాల్‌సింగ్ నాయక్, ఎస్ఐ, తాంసి