ఎదులాపురం, డిసెంబర్ 8 : పారదర్శకంగా ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు వివిధ పరీక్షలు నిర్వహించారు. వీటిని ఆదిలాబాద్ ఎస్పీ ప్రారంభించారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, మొదటి రోజు 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 493 మంది హాజరయ్యారు.
ఇందులో 230 మంది అభ్యర్థులు అన్ని విభాగాల్లో ఉత్తీర్ణత పొంది తుది పరీక్షకు అర్హత సాధించారు. మిగిలిన 263 మంది పలు అంశాల్లో విఫలమై వెనుదిరిగారు. అభ్యర్థులు మొదటగా సర్టిఫికెట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ (వేలిముద్రలు) రిస్ట్ బ్యాండ్, ఆర్ఎఫ్ఐడీ పూర్తి చేశారు. అనంతరం 1600 మీటర్ల పరుగు నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణత పొందిన వారికి ఎత్తు కొలిచారు. నిర్ణీత కొలతలున్న వారు లాంగ్ జంప్, షాట్‌ఫుట్ ఈవెంట్లు పూర్తి చేశారు. ఈవెంట్లు ఉండడంతో అభ్యర్థులు ఉదయం నాలుగు గంటల నుంచే పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కి వచ్చారు.
దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు, విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ నియామక మండలి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. ఎవరెవరు ఏఏ విభాగాల్లో ఉండాలో, సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అర్హతలు ఎలా పరీక్షించాలో సిబ్బందికి సూచించారు. ఈ మేరకు ప్రతి విభాగంలో సీసీ కెమెరాలు అమర్చారు. ప్రతి ఈవెంట్‌కు సంబంధించి వీడియో రికార్డింగ్ చేశారు. వీటిని భద్రపరుస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించిన వారిలో అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సీ సమయ్‌జాన్‌రావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ్, డీఎస్పీలు వీ ఉమేందర్, వీ వెంకటేశ్వరరావు, ఎస్ ఉపేందర్, ఉమామహేశ్వరరావు, సీఐలు, ఎస్ఐలు, ఉమ్మడి జిల్లా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.