ఎదులాపురం, జూలై 17 : నకిలీ ఆన్లైన్ లోన్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠాను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిలర్ ఆకాశ్ అలియాస్ తలారి ఆకాశ్‌ను అరెస్ట్ చేయగా, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. అంకోలి గ్రామానికి చెందిన మెస్రం ప్రవీణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన తకువ వడ్డీ రుణ ప్రకటనను నమ్మి వాట్సాప్ ద్వారా సంప్రదించాడు.
అనంతరం ప్రాసెసింగ్ ఫీజు, లోన్ అప్రూవల్, సర్వీస్ చార్జీలు, ఈఎంఐ పేర్లతో విడుతల వారీగా రూ.17,951 వసూలు చేసి ఎలాంటి రుణం మంజూరు చేయకుండా మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రధాన నిందితుడు గతంలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేశాడు.
అనంతరం తన సహచరులతో కలిసి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ప్రకటనలు, వాట్సాప్ సందేశాల ద్వారా ప్రముఖ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులమంటూ నమ్మించి, ముందస్తు చెల్లింపుల పేరుతో డబ్బులు వసూలు చేసి రుణాలివ్వకుండా మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.