ఎదులాపురం, డిసెంబర్ 18 : బీఆర్ఎస్తో దేశాభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. పట్టణంలోని 6వ వార్డు అటెండర్ కాలనీ, కుమ్మరికుంటలో రూ.30 లక్షలతో నిర్మించనున్న వంతెన, డ్రెయినేజీ నిర్మాణ పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.
బీజేపీ నాయకులు చిల్లర, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని.. మానుకోవాలని హితవు పలికారు. ఎనిదేళ్లుగా కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. బీజేపీ ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల మద్దతు లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రూపాయికే కిలో బియ్యం లాంటి పథకాలు దేశంలోని మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
దేశ ప్రజలు తెలంగాణలోని పథకాలను కోరుకుంటున్నారని, కేసీఆర్ ప్రధాని అయిన తర్వాత ఈ పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతాయన్నారు. 6వ వార్డులో రూ.5.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం 80 వేల సర్కారు కొలువులను భర్తీ చేస్తున్నదని చెప్పారు. ఉద్యోగాల సాధనకు స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు మిష్షు, శ్రీనివాస్ నావతే, మధు, రమేశ్, భగత్, అశోక్, గంగన్న, మున్న, రవీందర్, ప్రమోద్, కృష్ణ, సాయి, దత్తు, రాజన్న, సంతోష్ పాల్గొన్నారు.
బేల, డిసెంబర్18: స్వరాష్ట్రంలోనే అభివృద్ధి సాధ్యమైందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మండలం పౌజ్పూర్లో కన్నె దేవన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే జోగు రామన్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో 90శాతం ఉన్న పేద వర్గాలకు సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయని చెప్పారు. అనంతరం సవారీ బంగ్లా షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మార్శెటి గోవర్ధన్, వైస్‌ఎంపీపీ విజయ కుమార్, బీఆర్ఎస్ నాయకులు తుమ్మల వెంకట్ రెడ్డి , రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు లింగారెడ్డి, డైరెక్టర్ చంద్రయ్య, సర్పంచ్‌లు ఊశన్న, సంతోష్ రెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ పురుషోత్తంయాదవ్, ప్రవీణ్, చిన్నయ్య, గ్రామస్తులు ఉన్నారు.