ఆదిలాబాద్, మే 20(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం ప్రధాన కూడళ్లలో అధికారులు ఆక్రమణలను తొలగించారు. శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, దేవిచౌక్, కలెక్టర్ చౌక్ ప్రాంతాల్లో రెవెన్యూ, మున్సిపల్, పోలీసులు ఉదయం నుంచి తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆక్రమణలు తీసివేత సందర్భంగా ప్రధాన కూడళ్లలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నాలుగు కూడళ్లలో వీధి వ్యాపారులు రహదారులు, ఫుట్‌పాత్‌లు ఆక్రమించుకుని షెడ్లు, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో పట్టణంలోని ట్రాఫిక్ సమస్య అధికమైంది. కూరగాయలతోపాటు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు దుకాణాలకు వెళ్లిన జనం ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నాలుగు కూడళ్లలో అక్రమణలపై అధికారులు పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా మున్సిపల్ అధికారులు వీధి వ్యాపారులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.
నాలుగు చౌక్‌లలో వ్యాపారాలు చేసుకుంటున్న 201 మందిని గుర్తించి పాత గణేశ్ థియేటర్ స్థలంలో వారికి అవకాశం కల్పించారు. లక్కీడ్రా ద్వారా వీరికి స్థలం కే టాయించారు. ఉదయం సమయంలో అధికారులు, పో లీసులు జేసీబీతో ఆక్రమణల తీసివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుస్తు చర్యల్లో భాగంగా పలువురు వీధి వ్యాపారులను పోలీసులు వ్యాన్‌లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్‌కుమార్ మా ట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆక్రమణలను తొలగించినట్లు తెలిపారు. 17 రకాల వీధి వ్యాపారాలు చేసుకునే 201 మందికి గణేశ్ థియేటర్ వద్ద ప్రత్యామ్నాయ స్థలం కేటాయించినట్లు పేర్కొన్నారు. తిరిగి ఆక్రమణలపై పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు సునీల్‌కుమార్, కరుణాకర్‌రావు, ఫణిదర్, సాయినాథ్, ప్రణయ్‌కుమార్, స్వామి ఉన్నారు.