పెంబి, జూలై 21 : గిరిజన గ్రామాలకు తెలంగాణ ప్రభుత్వం రోడ్లు వేసేందుకు ఓ వైపు కృషి చేస్తుంటే.. మరోవైపు కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో పలు రోడ్ల పనులకు మోక్షం కలగడం లేదు. దీంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. పెంబి మండలంలోని అంకెనా, రాయదారి, కోరకంటి, కర్ణంలొద్ది, పొచంపల్లి పలు గ్రామాల ప్రజలు మండలకేంద్రానికి రావాలంటే 20 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తున్నది. పస్పుల నుంచి కోరకంటి వరకు అటవీ ప్రాంతం ఉండడంతో కేంద్ర అటవీ శాఖ అనుమతులు నిరాకరిస్తున్నది. దీంతో రోడ్డు ఏర్పాటుకు అడ్డంకిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మించడానికి సిద్ధంగా ఉంది. అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. కొన్ని నెలల క్రితం కేంద్ర బృందం సభ్యులు ఆయా గ్రామాల్లో పర్యటించి సర్వే చేశారు. ఇప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఆ గ్రామాలకు రోడ్డు ఏర్పాటు కలగానే మిగిలిపోతున్నది. అత్యవసర సమయంలో పెంబి పీహెచ్సీకి వెద్యం కోసం రావాలన్నా, ఆ గ్రామాలకు అంబులెన్స్ వెళ్లాలన్న, వంట గ్యాస్ తీసుకెళ్లాలన్న అంతే సంగతులు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు మట్టిరోడ్డు చిత్తడిగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పస్పుల నుంచి రాయదారి వరకు బీటీ రోడ్డు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కేంద్రం అనుమతులు ఇస్తేనే రోడ్డు
రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. పస్పుల నుంచి రాయదారి వరకు రోడ్డు ఏర్పాటుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేంద్ర అటవీ శాఖ రోడ్డు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకపోవడంతోనే పనులు నిలిచిపోతున్నాయి. ఇప్పటికైనా సమస్యను గుర్తించి రోడ్డు ఏర్పాటు చేయాలి.
-మహేందర్, సర్పంచ్, రాయదారి