ఇంద్రవెల్లి, ఏప్రిల్ 19 : జల్, జంగల్, జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సీమాంధ్ర సర్కారు తుపాకీ గురిపెట్టి తూటాల వర్షం కురిపించింది. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో గిరిపుత్రులు అసువులు బాశారు. ఈ ఘటనతో ఇంద్రవెల్లి పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఆ రక్తపు మరకలు నేటికీ చెరిగిపోలేదు. 41 ఏండ్ల క్రితం గిరిజనులు, వ్యాపారులు అధికారుల చేతుల్లో దోపిడీకి గురయ్యేవారు. ఈ క్రమంలో నక్సలైట్ల ఉద్యమం కూడా విస్తరించింది. వీరిని అణచివేయడానికి గిరిజన గూడేల్లో పోలీసుల బూట్ల చప్పుళ్లు మొదలయ్యాయి. ఈ తరుణంలో నక్సలైట్లు భూ పంపిణీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. గిరిజన సంఘాలు కూడా ఆందోళనకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి 1981, ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో బహిరంగసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినా వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని గిరిజన సంఘాలు ప్రకటించి ముందుకెళ్లాయి.
1981, ఏప్రిల్ 20న సోమవారం ఉదయం నాలుగు దిక్కుల నుంచి అడామగ, చిన్నాపెద్దా తేడాలేకుండా గిరిజనులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రవెల్లి అంతా గిరిజనులతో నిండిపోయింది. సమావేశం జరుగకుండా అప్పటి పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. వేలాది మందితో వస్తున్న గిరిజనుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ జవాన్ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రాణంకంటే శీలం ముఖ్యమనుకున్న ఆ యువతి జవాన్పై చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేసింది. అంతే.. ఆ జవాన్ నేలకొరిగాడు. దీంతో పరిస్థితి చేయిదాటి, తుపాకుల శబ్దంతో ఇంద్రవెల్లి దద్దరిల్లింది. గిరిజనులపై అప్పటి పోలీసులు తూటాల వర్షం కురిపించారు. దీంతో కొందరు గిరిజనులు నేలకొరిగారు. నేటికీ కూడా ఏప్రిల్ 20 వచ్చిందంటే చాలు గిరిజనులు వణికిపోతుంటారు. కాల్పుల ఘటనలో గాయాలపాలైన బాధితుల్లో కొంతమంది బతికే ఉన్నారు. కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలోని హీరాపూర్ గ్రామం వద్ద అమరవీరులు స్తూపం ఏర్పాటు చేశారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు స్తూపాన్ని డైనమైట్లతో కూల్చివేశారు. 1987లో అప్పటి ప్రభుత్వం స్మారక స్తూపాన్ని పునఃనిర్మాణం చేయించింది. ప్రతి యేడాది ఏప్రిల్ 20న వారికి గిరిజనులు నివాళులర్పిస్తుంటారు. అయితే స్తూపం వద్దకు గిరిజనులకు అనుమతించడానికి మాత్రం పోలీసులు నిరాకరిస్తున్నారు. గతంలో ఏప్రిల్ 18,20 మూడు రోజులపాటు ఉట్నూర్ రహదారిని దిగ్బంధించేవారు. ఈసారి మాత్రం అలాంటి ఆంక్షలు విధించకుండా పోలీసులు స్తూపం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా.. అమరవీరుల సంస్మరణ దినం కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ మంగళవారం పరిశీలించారు.
ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగురంకు చెందిన మడావి రాము, ఎర్మ దేవ్రావ్, కోట్నాక్ గాగ్రు, మండాడి జంగు, వెట్టి ఇస్రుబాయి.. వడగాంకు చెందిన కనక సోము.. కోయల్పాండ్రి గ్రామానికి చెందిన సెడ్మకి కొద్దు.. కన్నాపూర్ గ్రామానికి చెందిన కుమ్ర కొద్దు.. నిజాంగూడకు చెందిన పెందూర్ దేవ్రావ్.. జాకిట్గూడకు చెందిన డోంగుర్రావ్, ఎగోతిరావ్.. గౌరాపూర్కు చెందిన ముత్తు.. డోంగర్గాంకు చెందిన కోవ రాము.. మోహన్గూడ గ్రామానికి చెందిన ఆర్కా గంగు.. బంగారుగూడకు చెందిన సిడాం బాపురావ్.. మామిడిగూడకు చెందిన మెస్రం సురేశ్.. ఇచ్చోడ మండలంలోని సోన్పల్లికి చెందిన పెందూర్ బండు.. సిరికొండ మండలంలోని పాండుగూడకు చెందిన పెందూర్ గంగు మృతి చెందారు.