తాండూర్, అక్టోబర్ 20 : సింగరేణి ప్రాంతం, ఇక్కడి కార్మికులపై సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో జాతీయ కార్మిక సంఘాలు, ఇతర పార్టీలు పోగొట్టిన ఎన్నో హక్కులను అమలు చేశారు. ఎన్నో డిమాండ్లను నెరవేర్చారు. ఇదే ఆయనపై సింగరేణి కార్మికుల్లో అభిమానానికి కారణమైంది. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) సత్తా చాటితే తమకు మరింత మేలు చేకూరుతుందనే అభిప్రాయం కార్మిక వర్గాల నుంచి వినిపిస్తున్నది. ఈ ప్రాంతం నుంచి పన్నులు, రాయల్టీ రూపంలో దో చేస్తున్న కేంద్రం, సింగరేణి సంస్థ, ఇక్కడి కార్మికు ల గురించి పట్టించుకోవడంలేదు. దీంతో కేంద్రం లోని బీజేపీపై నల్లసూరీలు ఆగ్రహంగా ఉన్నారు.
సీఎం కేసీఆర్ కార్మికులతో రెండుసార్లు ఆత్మీ య సమ్మేళనాలు నిర్వహించి, అనేక పథకాలు ప్రకటించారు. దీంతో బొగ్గు గనులు ఉన్న రాష్ర్టా ల్లో ఎక్కడా లేని విధంగా, ఇక్కడ సంక్షేమ పథకా లు అమలవుతున్నాయి. ముఖ్యంగా కారుణ్య నియామకాల ద్వారా అనేక కుటుంబాల్లో వెలుగు లు నింపారు. గతంలో ఉన్న కారుణ్య నియామకా లను జాతీయ కార్మిక సంఘాలు చేసుకున్న ఒప్పందం కారణంగా సింగరేణిలో మంగళం పాడారు. కేసీఆర్ దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో ఆయన వెంటనే కారుణ్య నియామాకాలు తిరిగి అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 18 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారాయన.
కార్మికులకు సింగరేణి ప్రాంతంలో సొంతిల్లు అనేది కలగానే మిగిలిపోయింది. ఇక్కడ కార్మి కులు రిటైర్డ్ అయిన తర్వాత వారికి సొంత ఇల్లు కొనాలంటే ఉన్న డబ్బులు ఇంటికే సరిపోని దుస్థితి. దీంతో చాలా మంది కార్మికులు అద్దె ఇండ్లలోనే కాలం వెళ్లదీసే పరిస్థితి. దీనిని గమ నించిన ప్రభుత్వం సొంత ఇండ్లు నిర్మించుకున్న కార్మికులకు రూ. 10 లక్షల రుణంపై వడ్డీ చెల్లిం చేలా చర్యలు తీసుకున్నారు. కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పించారు. కార్మికులకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుం బాలకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ మొత్తం 10 రెట్లకు పెంచారు. కార్మికుల విద్యుత్ చార్జీలు రద్దు, ఉన్నత విద్యనభ్యసిస్తున్న కార్మికుల పిల్లలకు సింగరేణి సంస్థనే ఫీజులు చెల్లిస్తోంది. లాభాల బోనస్, పండుగ అడ్వాన్స్ పెంచడం, క్యాంటీన్ల ఆధునీకరణ లాంటి ఎన్నో సంక్షేమ కార్మికులకు ఆనందం కలిగిస్తున్నాయి.
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానిది 51 శాతం వాటా కాగా, కేంద్రానిది 49 శాతం వాటాగా ఉంది. దీంతో చాలా సందర్భాల్లో కేంద్రం కొర్రీలు పెడుతూ సింగరేణి సంస్థను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీక రణ విషయంలో సంస్థకు కేటాయించకుండా నానా ఇబ్బందులు పెట్టింది. సింగరేణి ఇతర రాష్ర్టాలకు విస్తరిస్తూ నైనీ, నూపాదపాత్ర లాంటి బొగ్గు బ్లాక్‌లను దక్కించుకుంటే కేంద్రం మాత్రం ఇక్కడి బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు అప్ప జెప్పే కుట్రలకు తెర లేపింది. ఇక్కడ కార్మికులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయ డంతో కేంద్రం వెనక్కి తగ్గింది. అయినా దొడ్డి దారిన ఆ బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరణ చేసేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. కార్మిక వర్గం చైతన్యంతో అది కాస్తా ఆగిపోయింది. అదే బీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పితే మిగతా బొగ్గు బ్లాక్‌లు కూడా సింగరేణికి కేటాయించుకునే అవ కాశం ఉంటుంది. ఇక సింగరేణిలో ఇప్పుడు నిర్ణ యాలు తీసుకోవాలంటే కేంద్రం పాత్ర ఉం టుంది.కొన్ని సందర్భాల్లో పెండింగ్‌లో పడ తాయి. కానీ ఇప్పుడా పరిస్థితి ఉండదు.
సింగరేణి సంస్థ కేంద్రానికి ప్రతి ఏటా వేల కోట్లు చెల్లిస్తుంది. ముఖ్యంగా సెస్‌ల రూపంలో ఈ నిధులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి. ఈ నేప థ్యంలో సింగరేణికి మాత్రం కేంద్రం ఒక్క రూపా యి కూడా విదిలించడం లేదు. కొత్త గనులు, బృహత్తర ప్రాజెక్టులకు ఎలాంటి ఆర్థిక ప్రోత్సా హం లేదు. ప్రతీ ఏటా మొండి చేయి చూపి స్తు న్నది. ఇక కార్మికులకు సంబంధించి సీఎంపీఎఫ్ ట్రస్టీ నిధులు లేక కూనారిల్లుతున్నది. కేంద్రం నుంచి ఈ ట్రస్ట్‌కు నిధులు ఇవ్వాలని కోరుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో భవి ష్యత్ లో కార్మికులకు సీఎంపీఎఫ్ చెల్లింపులు ఇబ్బం దికరంగా మారే ప్రమాదం ఉంది.
సింగరేణి ఓపెన్‌కాస్టుల ఏర్పాటులో పెద్ద ఎత్తున జాప్యం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో ఏండ్ల తరబడి పర్యావరణ అనుమతులు రావడం లేదు. దీనికి సింగరేణి సంస్థ పెద్ద ఎత్తున అధికా రులను, సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బొగ్గు తవ్వకాలు ఆలస్యమవుతు న్నాయి. కొన్ని సమయాల్లో ప్రాజెక్టు వ్యయం రెండింతలు అవుతున్నది. కేంద్రంలో మన ప్రభు త్వం ఉంటే కచ్చితంగా ఇలా ఆలస్యం కావడం కానీ, సమయం వృథా అవడం రెండూ ఉండవు. దీంతో ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు అనుకున్న సమ యానికి పూర్తవుతాయి. బొగ్గు ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది. ఇలా సంస్థకు అన్ని రకాలుగా లాభం చేకూరుతుంది.
బొగ్గు గని కార్మికులకు ఆదాయపు పన్ను మాఫీ అందని ద్రాక్షగానే మారింది. దశాబ్దాలుగా కార్మికులు ఈ డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభు త్వం పట్టించుకోవడం లేదు. మిలటరీ, ఆర్మీ వంటి త్రివిధ దళాల్లో పనిచేసే వారికి ఆదాయ పన్ను మాఫీ ఉంది. సింగరేణి కార్మికులకు కూడా ఇది వర్తింపజేయాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. తెలంగాణ అసెంబ్లీ తన మొదటి సమావేశాల్లోనే ఆదాయపు పన్ను రద్దుపై తీర్మా నం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వ విప్, అప్పటి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. అయినా దానిని చెత్తబుట్టలో వేశారు.
సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా వచ్చిన తర్వాత ఎన్నో హక్కులు సాధించుకున్నారు. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారితే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సైతం తన రూపాన్ని మార్చుకొని జాతీయ స్థాయి కార్మిక సంఘంగా మారనుంది. దీంతో జాతీయ స్థాయిలో బొగ్గు గని కార్మికుల జీవితాల్లో వెలుగు నిండనుంది. ఇప్పటికే కోలిండియాలో లేని అనేక సంక్షేమ కార్యక్రమాలు సింగరేణిలో అమలవుతున్నాయి. రేపు టీబీజీకేఎస్ జాతీయ యూనియన్‌గా ఆవిర్భవిస్తే మరింత మేలు జరిగే అవకాశం ఉందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై నేరుగా పోరాటం చేసే అవకాశం ఉంటుంది. సమస్యల చీకట్లో మగ్గుతున్న ఉన్న కార్మిక వర్గానికి జాతీయ యూనియన్‌గా ఆవిర్భవిస్తే కాంతి పుంజంలా దారి చూపనుంది.