బజార్హత్నూర్, అక్టోబర్ 20 : అడవుల జిల్లా ఆదిలాబాద్‌కు గోండు గిరిజనుల గుస్సాడీ వేషధారణ ప్రత్యేక గుర్తింపని మనకు తెలుసు.. కానీ ఆ సంప్రదాయానికి అనుగుణం గా వ్యవహరించేందుకు గిరిజనులు పడుతున్న శ్రమ,కష్టం వెనుక ఎంతో నైపుణ్యం దాగి ఉంది. మారుతున్న కాలంతో సంస్కృతీ సంప్రదాయాలను మరిచిపోతున్న తరుణంలో నాటి నుంచి నేటి వరకు సంస్కృతీ సంప్రదాయాలను వారి ఆస్తిగా గిరిజనులు కాపాడుకుంటూ వస్తున్నారు. దీపావళి సమీపిస్తుండడంతో అక్టోబర్ 24న జరుపుకునే వేడుకలకు బజార్హత్నూర్ మండలంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడేల్లో కోలాహలం మొదలైంది. సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించనున్నారు. దీపాలు వెలిగించడం కోసం స్వయంగా నువ్వుల నూనె తయారు చేస్తున్నారు. నెమలి ఈకల సేకరణ, డప్పులు, డోలక్ల తయారీ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు. గుస్సాడీ వేషధారణకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నా రు. పండుగకు వారం రోజుల ముందు నుంచి ప్రతిరోజూ రాత్రి గ్రామ పటేల్ ఇంటి ఆవరణలో కోలాటాలు, గుస్సాడీ నృత్యాలు సాధన చేస్తుండడం ఆనవాయితీగా వస్తున్నది.
గిరిజన గూడేల్లోని గ్రామ పటేల్ ఇంటి ఆవరణలో నెమలి ఈకలతో ప్రత్యేకంగా తయారుచేసిన టోపీలు, జంతు చర్మంతో తయారు చేసిన డప్పులు, డోలు, గుమేల, ఫరా వంటి వాయిద్యాలతో పాటు గజ్జెలు, కోలాలు, మంత్రదం డం, రోకలి తదితర సంప్రదాయ వస్తువులను ఒక్కచోట ఉంచి వాటికి మేకను బలిచ్చి ప్రత్యేకపూజలు చేస్తారు. భోగి పండుగ చేసి దండారీ ఉత్సవాలను ప్రారంభిస్తారు.
గుస్సాడీ వేషధారులు ఒక సంవత్సరం తమ సొంత గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి అక్కడి గిరిజనుల ఆతిథ్యం స్వీకరిస్తారు. విందులో పాల్గొని ఆటపాటలు, నృత్యాలతో కనువిందు చేస్తారు. గ్రామానికి వచ్చిన గుస్సాడీలకు ఘనస్వాగతం లభిస్తుంది. అంతేకాకుండా మొదట ఆతిథ్యం పుచ్చుకున్న వీరు తర్వాతి సంవత్సరం వారిని తమ గ్రామానికి ఆహ్వానిస్తారు. ఇలా చేయడంతో ఇరు గ్రామాల మధ్య బంధుత్వం పెరుగుతుందని పెద్దల నమ్మకం.