ఎదులాపురం/భైంసా, అక్టోబర్ 19 : సీతాఫలాలు ప్రకృతి ప్రసాదించిన ఫలాలు. వీటిలో సహజ సిద్ధమైన ఖనిజ లవణాలు, కార్బొహైడ్రేట్లు సమృద్ధిగా లభిస్తాయి. పోషకాలు రక్తంలో త్వరగా కలిసిపోయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవీ చలికాలంలో అధికంగా లభిస్తాయి. ఈ సీజన్లో సాధారణంగా జలుబు, దగ్గు, ఆయాసం రావడం సహజం. ఇటువంటి వారు ఈ పండ్లను తీసుకుంటే మంచిది. శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో దివ్యఔషధంగా పనిచేస్తాయి. సెగ గడ్డల సమస్య నుంచి బయట పడడానికి వీటి ఆకులు ఉపయోగపడుతాయి. వీటి ఆకులను నూరి సెగ గడ్డలు ఉన్నచోట కట్టుకట్టినట్లయితే త్వరగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆకుల కషాయం జలుబును నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. నరాల బలహీనత, మలబద్ధకంతో బాధపడే వారు ఆహారంగా తీసుకోవడం ప్రయోజనంగా ఉంటుంది. ఇందులో విటమిన్-సీ అధికంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు దరి చేరనివ్వదు. గజ్జి, తామర, గాయాలు ఉన్నచోట సీతాఫలం ఆకులను మెత్తగా నూరి, దానికి పసువు కలుపుకొని రాసుకుంటే త్వరగా తగ్గిపోతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ పండును జ్యూస్‌గా చేసుకొని.. అందులో పాలు, తేనె కలుపుకొని తాగడం వల్ల బరువు పెరుగుదలకు తోడ్పడుతుంది. గింజల్లోనూ ఔషధగుణాలు ఉన్నాయి. గింజలను మెత్తగా నూరి.. వాటికి మేకపాలు కలిపి పేస్ట్‌గా తయారు చేసుకొని బట్టతల, జుట్టు ఊడిపోయినచోట రాస్తే జుట్టురాలడం తగ్గడమే కాకుండా, మంచి ఫలితం ఉంటుంది.
టోకుల తీసుకుని చిల్లరగ అమ్ముత..
మేము కూలీ పనులు చేసుకునేటోళ్లం. సీతాఫలాలను టోకుల తీసుకుంట. ఈ యేడు వీటికాత తక్కువుంది. గందుకే ధరలు మస్తు పెరిగినయ్. దినమంతా అమ్ముతేనే నాలుగు రూపాలు దొరుకుతయి. గరీబోళ్లు గీ పండ్లు తినుడు కష్టంగనే ఉన్నది. కానీ.. పెద్దసార్లు కూడా కొసుర్తరు. అండ్ల మాకు మిగిలేదే ఏముండదని బాధపడుతుంటే గిట్ల చేస్తరు.
– సుంకరి లక్ష్మి, భాగ్యనగర్, ఆదిలాబాద్.
ఐదొందల దాకా దొరుకుతయి..
మా కులపొళ్లు మస్తుమంది గిదే యాపారం చేస్తరు. అట్ల నేను సుకా గీ చెట్టు ఉండేటి ఊళ్లకు పోయి టొకుల బేపారం చేస్త. గీ కలెక్టర్ చౌక్ల కూసుండి అమ్ముత. దినమంతా కూసుంటే ఐదొందల దాకా దొరుకుతయి. ఇంట్ల పిలగాండ్లు తిన్నకాడికి తిననిస్తము. మిగతయి గిట్లా తీసుకొచ్చి అమ్ముతం. ఇగ రాను రానూ గీ పండ్లు దొరుకుడు కష్టమే.
– గంగుబాయి, చిరు వ్యాపారి, ఆదిలాబాద్.