ఎదులాపురం, అక్టోబర్ 19 : ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన బండారి కిరణ్ కుమార్ (33) హత్య కేసులు పోలీసులు ఛేదించారు. మావల పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బండారి కిరణ్ కుమార్ గత నెల 28న ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో భార్య భాగ్యశ్రీ 1వ తేదీన మావల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ మొదటగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఇదే క్రమంలో గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గర్తించారు. మృతిచెందింది కిరణ్ కుమార్‌గా పోలీసులు నిర్ధారించారు. బండారి కిరణ్, వరుసకు కోడలు అయ్యే తోషం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి రమ్యతో నాలుగేళ్ల నుంచి పరిచయం ఉంది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఆ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండేవి. అలాగే కిరణ్ కుమార్‌ను రమ్య అన్నయ్య తాళ్లపెల్లి శివకుమార్, మేనమామ బండారి సంతోష్, బాబాయ్ తాళ్లపెల్లి రమేశ్ బెదిరించారు. అయినా వినకపోవడంతో శివకుమార్, సంతోష్, రమేశ్ హైదరాబాద్‌కు చెందిన చింతల రోహిత్ రెడ్డి, సిగ్గం రామకృష్ణ రెడ్డి ఆలియాస్ (ఆర్కే)తో కలిసి కిరణ్‌కుమార్‌ను చంపేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయమై ఫోన్లో మాట్లాడుకున్నారు. ప్లాన్ ప్రకారం గుడిహత్నూర్‌లోని డంప్‌యార్డు వద్ద ఓ గుంత తవ్వి పెట్టారు. ఈ క్రమంలో గత నెల 28న కిరణ్‌కుమార్‌ను కారులో ఎక్కుంచుకొని వెళ్లి మద్యం తాగించారు. డంప్‌యార్డు వద్దకు తీసుకెళ్లారు. వెంట తెచ్చిన పారతో కొట్టి చంపారు.
అనంతరం గుంతలో పాతిపెట్టారు. మిస్సింగ్ కేసు నమోదుపై 18న ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇన్కర్గూడలోని తన ఇంటి వద్ద తాళ్లపెల్లి రమేశ్‌ను పట్టుకున్నారు. విచారించగా, విషయం ఒప్పుకున్నాడు. సీఐ ఆదేశాల మేరకు మావల ఎస్ఐ విష్ణువర్ధన్ సిబ్బందితో హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరి రాత్రికి రాత్రే చింతల రోహిత్ రెడ్డి, సగ్గం రామకృష్ణరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు ఆర్మీ జవాన్లు బండారి సంతోష్, తాళ్లపెల్లి శివకుమార్ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమావేశంలో డీఎస్పీ వీ ఉమేందర్, రూరల్ సీఐ బీ రఘుపతి, మావల ఎస్ఐ విష్ణువర్ధన్, స్టేషన్ సిబ్బంది కరీం, మహేందర్ తదితరులు ఉన్నారు.