తాజాగా.. మోదీ సర్కారు మరో బాంబు పేల్చింది. తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చే ఎరువుల కేటాయింపులో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. మనకు అధికంగా యూరియా, పొటాష్, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అవసరం అవుతాయి. వీటిని తగ్గిస్తే సాగుపై ప్రభావం పడుతుందని, పెట్టుబడి కూడా నష్టపోతామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ సర్కారు సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వమేమో కుట్ర పూరితంగా వ్యవహరిస్తుండడంపై మండిపడుతున్నారు. కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా.. కేంద్రం నిర్ణయం తెలిసినప్పటి నుంచి రైతులు ఎరువుల దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా తీసుకొని వ్యాపారులు కూడా అధిక ధరకు విక్రయాలు చేస్తున్నారు.
నిర్మల్ టౌన్, అక్టోబర్ 18 : కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులకు పిడుగు లాంటి వార్త ప్రకటించింది. గత యాసంగి సీజన్లో పండించిన వడ్లు కొనుగోలు చేయబోమని ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీస్థాయిలో పోరాటం చేయడంతో ఎట్టకేలకు దిగొచ్చి కేంద్రం వడ్లు కొనుగోలు చేసింది. ఎప్పటిలాగే భూగర్భజలాలు పుష్కలంగా ఉండడం, రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండడంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఇప్పటికే రైతన్నలు వరి, మక్క, సోయా, పొద్దు తిరుగుడు, వేరుశనగ, జొన్న, శనగ తదితర పంటలు వేశారు.
ఈ సారి గతేడాది కంటే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో యాసంగి సాగుకు అవసరమయ్యే యూరియా, పొటాష్, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల్లో కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రైతన్నలు భగ్గుమంటున్నారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. కేంద్రం కేటాయించాల్సిన ఎరువులను తగ్గిస్తే సాగుపై ప్రభావం పడుతుందని, రైతన్నలు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రైతన్నల ఆందోళన
యాసంగికి ఎరువుల కేటాయింపులో భారీ కోత విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో 3,87,864 లక్షల ఎకరాలు సాగు అవుతుండగా.. దీనికి అదనంగా మరో 10 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉంది. వీటికి సుమారు 43,934 మెట్రిక్ టన్నుల యూరియా, 37,243 మెట్రిక్ టన్నుల డీఏపీ, 17,470 మెట్రిక్ టన్నుల పొటాష్, 23,580 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ రాష్ర్టానికి 4.29 లక్షల టన్నుల యూరియా, కాంప్లెక్స్ ఎరువులను తగ్గించడంతో ఈ కోత అన్ని జిల్లాలపై ప్రభావం చూపనుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా పత్తి, మక్క, సోయా, వేరు శనగ, శనగ, పప్పు దినుసుల పంటలతోపాటు ఆహార పంటలు సాగవుతాయి. వీటికి అన్ని రకాల ఎరువులను సరైన మోతాదులో వినియోగిస్తేనే దిగుబడి వస్తుంది. ఎరువుల సరఫరాలో కోత విధిస్తే ఎరువులు అందక దిగుబడి తగ్గి, పెట్టుబడి నష్టం వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే చాలా మంది రైతులు ఎరువుల దుకాణం నుంచి పెద్ద ఎత్తున ఎరువులను కొనుగోలు చేసి నిల్వలు చేసుకుంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు యజమానులు నిర్ణయించిన ధర కంటే రూ.20-30 అధికంగా వసూలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల రైతులకు రెండు విధాలా నష్టం జరగడంతో కేంద్రం తీరుపై రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ సర్కారు సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వమేమో కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ ఎరువుల కోత విధిస్తుండడంపై అన్నదాతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఎరువుల కోతను ఎత్తివేయాలి..
రైతులకు అవసరమయ్యే ఎరువులు అందించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తేనే కదా దేశంలో ప్రతి ఒక్కరికి ఆహారం దొరికేది. అటువంటిది ఎరువుల్లో కోత విధిస్తే మా పరిస్థితి ఏం కావాలి. యాసంగిలో యూరియా, కాంప్లెక్స్, పొటాష్ ఎరువులు పంటకు వాడితేనే మంచి దిగుబడులు వస్తాయి. ఎదిగే సమయంలో ఒకవేళ ఆ ఎరువులు దొరకకపోతే నష్టపోతాం. కేంద్రం పునరాలోచన చేసి ఎరువులపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలి.
– అర్జున్ లింగన్న, కూచన్పెల్లి.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
యాసంగిలో ఈసారి సాగు పెరిగే అవకాశం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువుల నిల్వలు ఉన్నాయి. భవిష్యత్తులో కోత ఏర్పడితే ఆ ప్రభావం రైతులపై పడే అవకాశం ఉంది. రైతులకు అవసరమైన ఎరువుల్లో కోత లేకుండా ముందస్తు చర్యలను తీసుకుంటాం.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, నిర్మల్.
మేం పంటలు ఎట్లా పండించాలి..
అందరు అన్నం తినాలంటే రైతులు పంటలు పండిస్తేనే సాధ్యం అవుతుంది. అటువంటిది ధాన్యాన్ని పండించే రైతులకు యాసంగిలో ఎరువుల కోత విధిస్తే మా పరిస్థితి ఏం కావాలి. ఏడాది క్రితం యాసంగిలో వడ్లు కొనమన్నా రు. తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి వడ్లను కొనుగోలు చేసింది. గిప్పుడు కేంద్రం ఎరువులు తక్కువగా ఇస్తే మేము పంటలు ఏమి పండించుకోవాలి. కేంద్రం వెంటనే తన విధానాన్ని మార్చుకొని ఎరువులు పూర్తిస్థాయిలో ఇవ్వాలి.
– ఏశన్న, రైతు, అందకూర్.