నిర్మల్ అర్బన్, అక్టోబర్ 18 : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని ఆస్రా కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెండు పాఠశాలల్లో ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ పనులను పరిశీలించారు. ప్రభు త్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ అభివృద్ధి పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఏఈలు నిత్యం పనులను పరిశీలించాలని ఆదేశించారు. ఈయన వెంట డీఈవో రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అరిగెల సంపత్ కుమార్, సెక్టోరియల్ అధికారి రాజేశ్వర్ తదితరులున్నారు.